‘‘గుళ్లోకి రాకుండా పూజారులు అడ్డుపడలేదు. గురద్వారాలో ప్రవేశించడంలోనూ ఇబ్బందులు తలెత్తలేదు. భారత లౌకికవాద భావన, సంస్కృతిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా. మనమంతా ఒకటేనని.. ఎల్లప్పుడూ కలిసే ఉండాలనే సందేశాన్ని ఇస్తున్నా’’ అని పేర్కొన్నారు ఇమ్రానా సైఫీ. దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తారు ఆమె. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భుజాన డబ్బా వేసుకుని.. జఫ్రాబాద్, ముస్తఫాబాద్, చందాబాగ్, నెహ్రూ విహార్, శివ్ విహార్, బాబూ నగర్ పరిసర ప్రాంతాల్లో శానిటైజర్ పిచికారీ చేస్తున్నారు. తనతో పాటు మరో ముగ్గురు మహిళలను కూడగట్టుకుని.. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూనే సేవను కొనసాగిస్తున్నారు. గుడి, మసీదు, గురుద్వార, చర్చి అనే తేడా లేకుండా ప్రతీచోటును ‘శుభ్రపరుస్తూ’ మత సామరస్యాన్ని వెల్లివిరిసేలా చేస్తున్నారు. (కాలి గాయం ఆమెను ఆపలేదు)
ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఇమ్రానా.. ఏడో తరగతి వరకు చదువుకున్నారు. అయితేనేమీ సమాజం పట్ల, మనుషుల తీరు పట్ల ఆమెకు మంచి అవగాహన ఉంది. సమాజ సేవ చేయాలనే తలంపు కూడా ఉంది. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన హింసలో గాయపడిన వారికి.. తన.. పర భేదాలు చూపకుండా ఆమె సహాయం చేసిన వైనం ఇందుకు నిదర్శనం. ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ ఇమ్రానా మరోసారి స్వచ్ఛంద సేవకు పూనుకున్నారు. శానిటైజ్ చేసేందుకు పూజారులు తనను గుళ్లోకి ఆహ్వానించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.(చేతిలో ఉంచండి)
ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ ఎంతటి ప్రమాదకారో అందరికీ తెలుసు. కాబట్టి శానిటైజేషన్ డ్రైవ్‌లో మాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు. ఏదేమైనా ఈ మహమ్మారి అన్ని వర్గాల వారిని ఒక్కటిగా నిలిపింది’’ అని చెప్పుకొచ్చారు. అన్నట్టు ఇమ్రానా ఆర్థికంగా సంపన్నురాలేమీ కాదు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ సమాజ సేవ చేయకుండా ఇవేమీ ఆమెను అడ్డుకోలేదు. ఇక ఇమ్రానా గురించి నెహ్రూ విహార్ నవ్ దుర్గా మందిర్ పూజారి పండిట్ యోగేశ్ కృష్ణ మాట్లాడుతూ.. మత సామరస్యాన్ని పెంపొందించే వారికి అందరూ తప్పక ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. విద్వేష భావాలను విడనాడి.. ప్రేమను పంచాలని.. అంతా కలిసికట్టుగా జీవించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment