నోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ
ఘోరమైన నిర్వహణా వైఫల్యం.. చట్టబద్ధంగా కొల్లగొట్టడమే
రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ ధ్వజం
► మన్మోహన్ హయాంలోనే నల్లధనం, కుంభకోణాలన్న జైట్లీ
► మాజీ ప్రధాని ప్రసంగించినంతసేపు సభలోనే మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ నిర్ణయాన్ని ‘వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధంగా కొల్లగొట్టడం’గా అభివర్ణించారు. ఈ అంశంపై వారం రోజులుగా అట్టుడుకుతున్న రాజ్యసభలో గురువారం మాజీ ప్రధాని మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 2 శాతం తగ్గుతుందన్నారు. ప్రధాని మోదీ సభకు హాజరవటంతో.. ప్రశ్నోత్తరాలను ఎత్తేసి నోట్లరద్దుపై చర్చకు అధికార, విపక్షాలు అంగీకరించాయి. మోదీ కూడా చర్చలో పాల్గొంటారని జైట్లీ సభకు వెల్లడించారు. దీంతో 12 నుంచి ఒంటిగంట మధ్య ప్రశ్నోత్తరాల్లో మన్మోహన్ ప్రసంగించారు.
‘నోట్లరద్దు పథకం ఉద్దేశం మంచిదే అయినా.. దీన్ని అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సామాన్యులు, పేదల కష్టాలను అంచనావేయటంలో ప్రభుత్వానిది ఘోరమైన నిర్వహణా వైఫల్యం’అని విమర్శించారు. పథకంలో లోపాలు వెతకటం తన ఉద్దేశం కాదన్న మాజీ ప్రధాని.. ఇప్పటికైనా సమస్యలకు ఆచరణసాధ్యమైన పరిష్కారాలు వెతికి దేశప్రజలను ఆదుకుంటే బాగుంటుందన్నారు. పరిస్థితులను మోదీ తక్కువ అంచనా వేశారన్నారు. రాత్రికి రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యవసాయం, అసంఘటిత రంగాలు, చిన్న పరిశ్రమలు చాలా నష్టపోయాయని, ప్రజలకు నోట్లు, బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోతోందని అన్నారు. 50 రోజులు సహకరించాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తిని మన్మోహన్ తప్పుబట్టారు. నోట్లరద్దు అంతిమ ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరన్నారు. ‘50 రోజుల సమయం తక్కువే. కానీ పేదలు, సామాన్యులకు ఈ 50 రోజులు నిత్య నరకం.
అందువల్లే ఇప్పటివరకు 60-65 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా ప్రజల విశ్వాసం దెబ్బతింటోంది’ అని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులకు అనుగుణంగా రోజుకో కొత్త నిర్ణయం తీసుకోవటం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంకుపై విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. రిజర్వ్ బ్యాంకుపై వస్తున్న విమర్శలన్నీ న్యాయమైనవేనన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గరగా ఉండే.. సహకార బ్యాంకులను తాజా పథకంలో చేర్చకపోవడం పెద్ద తప్పిదమన్నారు.
ఆయన హయాంలోనే నల్లధనం పోగైంది
మన్మోహన్ ప్రసంగంపై ఆర్థిక మంత్రి జైట్లీ దీటుగా స్పందించారు. మన్మోహన్ నోట్లరద్దు పథకాన్ని విమర్శించటంలో ఆశ్చర్యమేమీ లేదని.. ఎక్కువ నల్లధనం పోగైంది ఆయన హయాంలోనేనని అన్నారు. జీడీపీ తగ్గుతుందనడంలో వాస్తవం లేదని.. నోట్ల రద్దు వల్ల మాధ్యమిక, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని.. షాడో ఎకానమీలోని డబ్బంతా ప్రధాన వ్యవస్థలోకి వస్తుందన్నారు. నోట్ల రద్దుతో రైతులు, సామాన్యులకు బ్యాంకులు మరిన్ని రుణాలి స్తాయన్నారు. ‘తమ కళ్లెదుటే నల్లధనం, స్కాంలు జరిగినా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నల్లధనంపై వ్యతిరేక పోరాటాన్ని పెద్ద తప్పిదంగా పరిగణించటం హాస్యాస్పదం.
ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. కానీ విపక్షమే చర్చనుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతోంది’అని విమర్శించారు. ఓ ఆర్థికవేత్త ఇలాంటి అంశాలపై తక్షణ ప్రభావాన్ని మించి ఆలోచన చేయాలన్నారు. మన్మోహన్ మాట్లాడుతున్నంతసేపు మోదీ సభలోనే ఉన్నారు. భోజన విరామానికి ముందు జైట్లీ, నఖ్వీలతో వెళ్లి మన్మోహన్‌తోపాటు విపక్షనేతలను ప్రధాని ఆప్యాయంగా పలకరిం చారు. అంతకుముందు మన్మోహన్ మాట్లాడ తారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ.. డిప్యూటీ చైర్మన్‌ను కోరారు. దీనిపైజైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోట్లరద్దుపై చర్చలో భాగంగా మాట్లాడితే అభ్యంతరం లేదన్నారు.
దీనిపై అధికార, విపక్షాల మధ్య ఆందోళనతో సభ ప్రశ్నోత్తరాల సమయం వరకు వారుుదా పడింది. తిరిగి మొదలు కాగానే మోదీ రాకపోవటంతో విపక్షాలు నిరసన తెలిపారుు. మోదీ సభకు వస్తారని కురియన్ చెప్పారు. అటు లోక్‌సభలో వారుుదా తీర్మానంపై వెనక్కుతగ్గేది లేదని విపక్షాలు చెప్పటంతో గందరగోళం నెలకొంది. దీంతో సభను స్పీకర్ రేపటికి వారుుదా వేశారు.