మన్మోహన్ పై మోదీ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నోట్ల రద్దుతో నిజాయితీపరులకు మేలు జరిగిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగిస్తూ... అవినీతిపై పోరాటం రాజకీయం కాదని స్పష్టం చేశారు. 1971లో పెద్ద నోట్లను రద్దు చేయాలని అప్పటి ఆర్థికమంత్రి సూచించగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ తిరస్కరించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
తాము పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో నిట్టనిలువునా చీలిక వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు ఒకవైపున నిలబడితే... కొంత మంది నాయకులు, ప్రతిపక్షాలు మరోవైపున ఉన్నారని వ్యాఖ్యానించారు. నోట్లను రద్దు చేసిన తర్వాత 40 రోజుల్లో 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. అవినీతిపై తమ పోరాటం ఆగదని పునరుద్ఘాటించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు. 21 కోట్ల మందికి రూపేకార్డులు ఇచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ వాకౌట్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో రాజ్యసభలో గందరగోళం రేగింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుకున్న కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ... ‘బాత్రూంలో రెయిన్ కోటు వేసుకుని స్నానం చేయడం ఎలాగో ప్రజలు మన్మోహన్ సింగ్ నుంచి నేర్చుకోవాల’ని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. 35 ఏళ్ల పాటు దేశ ఆర్థిక విధానాలపై మన్మోహన్ ప్రభావం ఉందని తర్వాత మోదీ పేర్కొన్నారు.