డేరా ఐటీ చీఫ్ అరెస్ట్
సాక్షి,సిర్సాః డేరా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌పై విచారణ వేగవంతమైన క్రమంలో బుధవారం సిర్సాలో డేరా సచ్చా సౌథా ఐటీ విభాగం హెడ్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్మీత్ సింగ్ అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణై జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో పరారీలో ఉన్న ఐటీ హెడ్ వినీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. డేరా బాబాను దోషిగా నిర్ధారించిన పంచ్‌కుల కోర్టు నుంచి ఆయన తప్పించుకునేందుకు హనీప్రీత్ కుట్ర పన్నిందనే అభియోగాలపై ఆమెపై రాజద్రోహం కేసు నమోదైంది.
అంతకుముందు భటిండా జిల్లా సలబత్‌పురా డేరా కేంద్రం ఇన్‌ఛార్జిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సలబత్‌పురా డేరా హెడ్ జోరా సింగ్‌ను రాజద్రోహం, ఇతర అభియోగాలపై అరెస్ట్ చేశామని భటిండా ఐజీ ఎంఎస్ చిన్నా చెప్పారు.గత నెలలో పంచ్‌కుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం హింసకు ప్రేరేపించారని జోరాపై ఆరోపణలున్నాయి. భటిండా జిల్లాలోని సలబత్‌పురా డేరా కేంద్రం పంజాబ్‌లోనే అతిపెద్ద సెంటర్ కావడం గమనార్హం.