మోడీ వచ్చె.. డీజిల్ ధర తగ్గె!!
ఏ ముహూర్తంలో నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో గానీ.. ఆయనకు అన్నీ కలిసొస్తున్నాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరమైన తప్పిదాలు ఆయనకు బంపర్ మెజారిటీ తీసుకొచ్చి తిరుగులేని ప్రధానిగా నిలబెడితే.. అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత దేశంలో డీజిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ ముడి చమురు ధర 14 నెలల తర్వాత మళ్లీ వంద డాలర్ల కంటే తక్కువ రేటు పలుకుతోంది. అది 99.6 డాలర్ల వరకు వెళ్లింది. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఈ ధర దాదాపు 115 డాలర్లు ఉండేది. దాంతో పెట్రోలు, డీజిల్ ధరలను బాగా పెంచాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు 100 డాలర్ల కంటే తక్కువ స్థాయికే క్రూడాయిల్ ధరలు చేరుకోవడం మోడీకి కలిసొచ్చింది. ఇప్పటివరకు ప్రతిసారీ డీజిల్ ధరను అర్ధరూపాయి వంతున పెంచుకుంటూ వస్తున్నారు. పెట్రో ధరలను పదిహేను రోజులకోసారి సమీక్షిస్తారు. చమురు కంపెనీలకు వస్తున్న లాభ నష్టాల ప్రాతిపదికన ఎంత ధర పెంచాలి, లేదా తగ్గించాలనే విషయాలను నిర్ణయిస్తారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. డీజిల్ అమ్మకాల మీద నష్టాల మాట అటుంచి, చమురు కంపెనీలకు లాభాలు కూడా వస్తున్నాయి. దాంతో సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారిగా డీజిల్ ధరలు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు పెట్రోలు ధరలు కొంతమేర తగ్గినా.. డీజిల్ మాత్రం తగ్గిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎటూ తగ్గడంతో.. ఇదే అదునుగా డీజిల్‌పై ఉన్న పాక్షిక నియంత్రణను ఎత్తివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికిప్పుడు నియంత్రణ ఎత్తివేయడం వల్ల అంతగా సమస్య రాదు గానీ.. భవిష్యత్తులో బ్యారెల్ ముడి చమురు ధర హఠాత్తుగా 10, 20 డాలర్లు పెరిగితే డీజిల్ ధర కూడా భారీగా పెరిగితే మాత్రం ఒక్కసారిగా చమురు కంపెనీలు భారీగా పెంచే ప్రమాదం లేకపోలేదు.