అమల్లో ఉంది లాక్‌డౌనా, కర్ఫ్యూనా? | Difference Between Lockdown And Curfew | Sakshi

లాక్‌డౌన్‌కు, కర్ఫ్యూకు తేడా ఏమిటీ?

Mar 26 2020 2:24 PM | Updated on Mar 26 2020 3:59 PM

Difference Between Lockdown And Curfew - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశవ్యాప్తంగా ‘లాక్‌డౌన్‌’ను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. వాస్తవానికి ‘లాక్‌డౌన్‌’ అనే పదం ఏ చట్టంలోనూ లేదు. ప్రజల కదలికలను నియంత్రిస్తూ ఆంక్షలు విధించడాన్నే ‘లాక్‌డౌన్‌’గా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆంక్షలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, అప్పటికి పరిస్థితి అదుపులోకి రానట్లయితే కర్ఫ్యూ విధిస్తామని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లేందుకు కర్ఫ్యూ పాస్‌లు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు  ఇప్పుడు డిమాండ్‌ చేస్తున్నారు. ( నిబంధనలు ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు )

ఇంతకు లాక్‌డౌన్‌కు, కర్ఫ్యూకు తేడా ఏమిటీ ?
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు అన్ని రాష్ట్రాలు ‘ఎపిడమిక్‌ డిసీసెస్‌ ఆఫ్‌ 1897 యాక్ట్, డిసాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌’ కింద ప్రత్యేక ఆదేశాలను జారీ చేశాయి. ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి కదలరాదు. అస్పత్రులకు లేదా మందుల షాపులకు వెళ్లడం, ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకోవడం కోసం వెళ్లే అత్యవసర సమయాలు, నిత్యావసర సరకుల కోసం వెళ్లడం మినహా అన్ని సమయాల్లో ఇంట్లో ఉండాలి. అత్యవసర సేవలు అందించే ఆస్పత్రులు, నిత్యావసర సేవలు అందించే వారితోపాటు ఆర్థిక, ఇతర సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపు ఇచ్చాయి. ( కోవిడ్‌: నిమిషాల్లోనే నిర్ధారణ! )

రోడ్లపై ఐదుగురికి మించి తిరగరాదంటూ ఐపీసీలోని 144వ సెక్షన్‌ కింద కూడా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. 144వ సెక్షన్‌ కింద ఆదేశాలను ఏ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అయినా ఇవ్వొచ్చు. లాక్‌డౌన్‌ ఉత్తర్వులను ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే చీఫ్‌ సెక్రటరీ విడుదల చేస్తారు. కర్ఫ్యూ ఉత్తర్వులను ఒకప్పుడు డీఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి జారీ చేయగా, 2009లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పోలీసు కమిషనర్‌ తమ జురిడిక్షన్‌లో కర్ఫ్యూను విధించవచ్చు. కర్ఫ్యూ కింద కూడా 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ఐదుగురికి మించి ఎక్కడా గుమికూడరాదు. కర్ఫ్యూ సమయాల్లో బయట తిరగరాదు. తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిన ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాంతం పోలీసు స్టేషన్‌ నుంచి పాస్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. నిత్యావసర సరకుల కోసం కర్ఫ్యూ సడలింపు వేళల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. లౌక్‌డౌన్‌లో రాత్రి మినహా పగలు ఎప్పుడైనా నిత్యావసరాల కోసం పౌరులు వెళ్లవచ్చు. కర్ఫ్యూ ఉన్నా లేదా లాక్‌డౌన్‌ ఉన్నా అత్యవసరాల్లో పౌరులు బయటకు వెళ్లవచ్చు. (కరోనాపై యుద్ధం: భారత్‌పై చైనా ప్రశంసలు)

వాస్తవానికి నేడు దేశంలో చాలా రాష్ట్రాలు కర్ఫ్యూను. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.  కర్ఫ్యూను అమలు చేయడంలో భాగంగా ఉల్లంఘించిన వారిని పోలీసులు లాఠీలతో చితక బాదడం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా పోలీసులు లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి లాఠీలకు పని కల్పిస్తున్నారు. అది ఎప్పటికీ చట్ట విరుద్ధమే. అయితే ఎపిడమిక్‌ డిసీస్‌ యాక్ట్‌ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులకు విచారణ నుంచి మినహాయింపు ఉంది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ఇక్కడ ప్రధానంగా వైద్య అవసరాలకు నిధులను ఖర్చుపెట్టడానికి సంబంధించిన  వ్యవహారం మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement