
‘డిజిటల్ ఇండియా ఢిల్లీలో ఏమైంది?’
ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్రమోదీ ఏ వేదికపై ఉన్నా కూడా భారతదేశం శరవేగంతో ముందుకెళుతోందని, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో అడుగులేస్తుందని చెప్తున్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్రమోదీ ఏ వేదికపై ఉన్నా కూడా భారతదేశం శరవేగంతో ముందుకెళుతోందని, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో అడుగులేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు కార్యక్రమం తర్వాత డిజిటలైజేషన్ పదం మాత్రం తెగ వినిపిస్తోంది. అయితే, ఇదంతా కూడా ఇంకా మాటల స్టేజీలోనే ఉందని అమల్లోకి రావడంలేదని నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి రిపబ్లిక్ డే సాక్షిగా తెలిసింది.
అవును గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో పెద్ద మొత్తంలో గ్రాండ్ పరేడ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిని వీక్షించేందుకు ఏర్పాటుచేసిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పొందే వీలు లేకుండా పోయింది. మొత్తం ఏడు చోట్ల కౌంటర్లు ఏర్పాటుచేసి అక్కడి నుంచి టికెట్లు విక్రయిస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌కోసం టిక్కెట్ల వ్యవహారం మొత్తం డిజిటలైజేషన్ చేస్తామని చెప్పినప్పటికీ అది పూర్తి కాలేదు. అయితే, డెబిట్, క్రెడిట్‌లతో ఈ టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం మాత్రం ఏర్పడింది.