కొట్టాయం : దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభిస్తున్న తీరు ఆందోళన రేపుతోంది. ఇప్పటికే కర్ణాటకలో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా భావిస్తున్నారు. ఈ తరుణంలో కేరళలో 85 ఏళ్ల మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో కోవిడ్ -19కు చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య అధికారులు బుధవారం వెల్లడించారు. గుండె జబ్బు ఇంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల దృష్ట్యా పరిస్థితి తీవ్రంగా ఉందనీ, అయితే ఆమె 96 ఏళ్ల భర్త ఆరోగ్యం మాత్రం స్థిరంగా ఉందని తెలిపారు. ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి తిరిగి వచ్చిన కరోనా వైరస్ బాధిత వ్యక్తి (24) తల్లిదండ్రులు వీరిద్దరు. ఇదిలా వుండగా, ప్రారంభ దశలో జ్వరం బారిన పడిన ఇద్దరు కరోనావైరస్ సోకిన వ్యక్తులు సంప్రదించిన తిరువత్తుకల్‌లో క్లినిక్ నడుపుతున్న వైద్యుడిని కూడా పరిశీలనలో ఉంచారు.
మరోవైపు వ్యాధి లక్షణాలను దాచిపెట్టడం, వ్యాధివిస్తరణకు దారి తీసే చర్యలకు దేనికైనా మద్దతివ్వడం ప్రజారోగ్య చట్టం ప్రకారం నేరమని కేరళ ఆరోగ్య మంత్రి కే కే శైలజ ప్రకటించారు. అలాగే ప్రభావిత ప్రాంతాలు,లేదా దేశాల నుండి తిరిగి వచ్చిన వారి ప్రయాణ వివరాలను గోప్యంగా ఉంచిన అంశాన్ని కూడా నేరంగా పరిగణిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment