
కొత్త ఏడాది వేడుకలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేడుకల కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూకి సిద్ధమైంది.
ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్టేట్స్ అప్రమత్తం అయ్యి నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కేరళ చేరింది. అయితే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 2, 2022 దాకా.. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా ఈ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. కొవిడ్-19 పరిస్థితిపై సోమవారం నిర్వహించిన సమీక్ష అనంతరం పినరయి విజయన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జనసందోహం గుమిగూడే అవకాశం ఉన్నందున, వైరస్ విజృంభించొచ్చని కేబినెట్ అభిప్రాయపడింది. అనవసరంగా గుమిగూడడం, ప్రయాణాలు నైట్ కర్ఫ్యూ టైంలో నిషేధం. ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఇక 31వ తేదీ రాత్రి పబ్‌లు, బార్‌లు, హోటళ్లు సైతం 10గం.కే మూతపడాల్సిందే. బీచ్‌లు, రోడ్లు అన్నీ పోలీసుల నజర్‌లో ఉంటాయి. అంటే.. 31తేదీ నాడు రాత్రి పది తర్వాత వేడుకలు ఉండయన్నమాట!