
తప్పుడు సర్వేలపై చర్యలకు ఈసీ ఆదేశం
న్యూఢిల్లీ: పారదర్శకంగా లేని ఎన్నికల సర్వేలపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. తప్పుడు నివేదికలు, సర్వేలు ప్రచురిస్తున్న సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కొన్ని సంస్థలు డబ్బులు తీసుకుని కుట్రపూరితంగా తప్పుడు సర్వేలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు కలసి చర్యలు తీసుకోవాలని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ కే అజయ్ కుమార్ ఈ మేరకు లేఖ రాశారు.
ఎన్నికల సర్వేలు నిర్వహించిన కొన్ని సంస్థలపై ఓ చానెల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. కొందరికి అనుకూలంగా సర్వేలు ప్రచురించినట్టు ఆయా సంస్థలు అంగీకరించినట్టు తేలింది. కాంగ్రెస్ ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణతో తప్పుడు సర్వేలు ప్రచురించిన ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించింది.