తదుపరి సీఈసీగా నసీమ్ జైదీ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా నసీమ్ జైదీ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీఈసీ హెచ్ ఎస్ బ్రహ్మ పదవీకాలం ఏప్రిల్ 19తో ముగియనుండటంతో నూతన సీఈసీ ఎంపిక అనివార్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విదేశీ పర్యటనకు బయలుదేరనున్న నేపథ్యంలో జైదీ నియామకానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ బుధవారమే పూర్తిచేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఫైలును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. జైదీ పూర్తిపేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ
1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా కొనసాగుతున్న ఆయన సీఈసీ పదవిని చేపడితే ముగ్గురు సభ్యుల ఎలక్షన్ కమిషన్లో కమిషనర్ పదవులు రెండీంటికీ ఖాళీ ఏర్పడినట్లవుతుంది. ఒక సభ్యుడు ఇదివరకే రిటైరయ్యారు. అనతి కాలంలోనే ఈ నియామకాలను కూడా చేపడతామని న్యాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.