Nasim Zaidi
-
ఈవీఎంలపై 12న కీలక భేటీ
అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ న్యూఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 12న ఢిల్లీలో అఖిలపక్ష భేటీని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీ నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలను ఎత్తివేసి తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల బృందం ఈసీని కలిసి ఓ విజ్ఞాపనను అందజేసింది. అయితే, ఈవీఎంలపై ఆరోపణలు ఖండించిన ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈవీఎంలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు ఈసీ తెలిపింది. -
ఈవీఎంలపై త్వరలోనే కీలక మీటింగ్!
అఖిలపక్ష భేటీని నిర్వహించనున్న ఈసీ చండీగఢ్: ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్టూ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ నసీం జైదీ తెలిపారు. ఈవీఎంల విషయంలో మరింత పారదర్శకతను ప్రదర్శించేందు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ‘త్వరలోనే అఖిలపక్షం భేటీ నిర్వహించి.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ఈ విధంగా కుదరదో వివరిస్తాం. ఇందులో భద్రతాపరమైన, పాలనపరమైన రక్షణల గురించి స్పష్టత ఇస్తాం’ అని జైదీ మీడియాకు చెప్పారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఇటీవల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. -
కీలక ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ఎలా?
-
కీలక ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ఎలా?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన కమిషన్ బుధవారం నగారా మోగించింది. అయితే ఈ కీలక ఎన్నికలకు ముందు ఈ మాసాంతంలో నిర్వహించనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశంపై తమకు ప్రతిపక్షాలనుంచి అభ్యంతరాలు అందాయని ఎన్నికల కమిషన్ ఛైర్మన్ నసీం జైదీ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో బడ్జెట్ సమర్పణ మార్చి 11వ తేదీకి తరువాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఎన్నికల తేదీలు తదితర కీలక ఘట్టాలకు సంబంధించిన వివరాలను నసీం ప్రకటించారు. మార్చి 11 న అయిదు రాష్ట్రాల కౌంటింగ్ ను నిర్వహించనున్నారు. అలాగే తాజా సుప్రీంకోర్టు తీర్పుకు తాము కట్టుబడి ఉన్నామని ఈసీ స్పష్టం చేసింది. మత, కులం పేరులో ఓట్లు అడగడం అవినీతి కిందికి వస్తుందన్న హిందుత్వ కేసులో సుప్రీం తీర్పును కచ్చితంగా పాటిస్తామని ఈసీ ఛైర్మన్ స్పష్టం చేశారు. అలాగే ప్రతీ అభ్యర్తి సోషల్ మీడియా ఖాతాల వివరాలను సమర్పించాలని కూడా ఈసీ కోరింది. ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసింది. మరోవైపు నిబంధనలను మరింత కఠినతరం చేసిన ఈసీ అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చునూ నమోదు చేయాలని, దాన్ని నిత్యమూ అధికారులకు అందించాలని సూచించింది. ఒక్క రూపాయి నగదు ఖర్చును అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థీ విధిగా ఎన్నికల ఖాతాను ప్రారంభించాలని, దాని ద్వారానే కేటాయింపులు జరపాలని ఆదేశించింది. సదరు ఖాతాలోని వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఈసీకి అందించాలని, ఒకవేళ బ్యాంకుల ద్వారా కాకుండా చెల్లింపులు జరపాల్సి వస్తే, చెక్కులు జారీ చేయాలని సూచించింది. రూ. 20 వేల కన్నా అధిక మొత్తంలో డొనేషన్లు వస్తే, అది చెక్కులు లేదా డీడీల రూపంలో మాత్రమే ఉండాలని పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ ఖర్చులపై పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ప్రకటించాలని ఆదేశించింది. -
నిర్బంధ ఓటింగ్ ఆచరణలో అసాధ్యం
న్యూఢిల్లీ: నిర్బంధ ఓటింగ్ ఆలోచన ఆచరణలో అసాధ్యమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఓ సదస్సులో నసీం జైదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని దేశాల్లో అమలవుతున్న తప్పనిసరి ఓటింగ్ విధానం చర్చకు తావిస్తోందని, కానీ ఇది ఆచరణలో అసాధ్యమని గుర్తించినట్లు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంపై ప్రశ్నించగా, జైదీ స్పందిస్తూ.. దీనికి సంబంధించి చట్ట సవరణకు అన్ని రాజకీయపార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని పార్లమెంటరీ కమిటీతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా ఈ ప్రతిపాదనను సమర్థిస్తామని, ఇందుకు రూ.9 వేల కోట్ల వ్యయమవుతుందని మే నెలలో న్యాయ మంత్రిత్వ శాఖకు ఎన్నికల కమిషన్ సమాధానమిచ్చింది. అలాగే పెద్ద సంఖ్యలో ఈవీఎంలు కొనాల్సి ఉంటుందని పేర్కొంది. -
‘అన్ని ఎన్నికలూ ఒకేసారి నిర్వహించగలం’
మెల్బోర్న్: అన్ని పార్టీలూ ఏకాభిప్రాయానికి వచ్చి, రాజ్యాంగ సవరణలు చేస్తే దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెప్పారు. ఇందుకు అధిక సంఖ్యలో ఈవీఎంలు, తాత్కాలిక సిబ్బంది వంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సందర్శకులు (ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్) కార్యక్రమంలో జైదీ పాల్గొన్నారు. అనంతరం జైదీ మాట్లాడుతూ... పార్లమెంటరీ కమిటీకి ఏకకాల ఎన్నికల ప్రతిపాదన చేశాం. కార్యరూపం దాల్చాలంటే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మధ్య విస్తృత చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. -
5 రాష్ట్రాల్లో మోగిన ‘అసెంబ్లీ’ నగారా
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. వివిధ దశల్లో ఏప్రిల్ 4 నుంచి మే 16వరకు 43 రోజుల్లో ఈ తతంగం పూర్తి చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. తమిళనాడు (234), కేరళ (140), పుదుచ్చేరి (30)లో మే 16న ఒకే దశలో అన్ని సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అస్సాం(140)లో 2 దశల్లో, పశ్చిమబెంగాల్ (294)లో ఆరు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని జైదీ తెలిపారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందం కారణంగా.. పశ్చిమబెంగాల్లో కూచ్ బెహార్ జిల్లాలో కొత్తగా చేర్చిన 16వేల మందికి ఓటుహక్కు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈ ప్రాంతంలోచివరి దశలో ఎన్నికలు నిర్వహించనున్నామని.. అదే విధంగా వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న ప్రాంతాల్లో తొలిదశలో ఎన్నికలు పూర్తిచేయనున్నట్లు జైదీ వెల్లడించారు. కేరళలో ఓటర్ లిస్టులో అక్రమాలపై మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధునాతన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తామని తెలిపారు. మే 16న అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత.. మే 19న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అస్సాం, కేరళల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఈ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వివిధ ప్రాంతీయపార్టీలతో పొత్తుపెట్టుకుని ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. పశ్చిమబెంగాల్లో కీలక శక్తిగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో తొలిసారిగా నోటాకు ఓ గుర్తును కేటాయించనున్నట్లు జైదీ తెలిపారు. దీన్ని అభ్యర్థుల జాబితాలో చివరన పొందుపరుస్తామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 1.18 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఒంటరిపోరే: మమత పశ్చిమబెంగాల్లో ఒంటరిపోరు చేయనున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా వెల్లడించారు. ఈసీ పోలింగ్ తేదీలను వెల్లడించగానే.. మమత కూడా 294 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. గతంలో 31గా ఉన్న మహిళా అభ్యర్థుల సంఖ్యను 45కు (15%) మైనార్టీల సంఖ్యను 38 నుంచి 57కు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన రవాణా మంత్రి మదన్ మిత్రా కూడా పోటీ చేస్తారని మమత తెలిపారు. -
నేడు సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న జైదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నసీం జైదీ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన హెచ్ ఎస్ బ్రహ్మ పదవి కాలం శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఈసీగా నసీం జైదీని నియమిస్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నిక కమిషనర్‌గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నసీం జైదీ పూర్తి పేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ. 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. జైదీ సీఈసీగా జులై 2017 వరకు కొనసాగనున్నారు. -
తదుపరి సీఈసీగా నసీమ్ జైదీ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా నసీమ్ జైదీ నియమితులు కానున్నారు. ప్రస్తుత సీఈసీ హెచ్ ఎస్ బ్రహ్మ పదవీకాలం ఏప్రిల్ 19తో ముగియనుండటంతో నూతన సీఈసీ ఎంపిక అనివార్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విదేశీ పర్యటనకు బయలుదేరనున్న నేపథ్యంలో జైదీ నియామకానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ బుధవారమే పూర్తిచేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఫైలును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. జైదీ పూర్తిపేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీమ్ జైదీ 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జైదీ.. పౌర విమానయాన శాఖలో చాలాకాలం పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న ఆయన సీఈసీ పదవిని చేపడితే ముగ్గురు సభ్యుల ఎలక్షన్ కమిషన్‌లో కమిషనర్ పదవులు రెండీంటికీ ఖాళీ ఏర్పడినట్లవుతుంది. ఒక సభ్యుడు ఇదివరకే రిటైరయ్యారు. అనతి కాలంలోనే ఈ నియామకాలను కూడా చేపడతామని న్యాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.