సాక్షి, న్యూఢిల్లీ : రుణ మాఫీపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రస్తావించడం ఆసక్తి రేపింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు రుణ మాఫీ హామీలివ్వడం సరైంది కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడాన్ని జైట్లీ ప్రస్తావించారు. రుణ మాఫీ వాగ్ధానాలతో లబ్దిదారులు రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నా చెల్లించేందుకు ముందుకురారరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు.
ఈ పరిణామం బ్యాంకింగ్ రంగంతో పాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారన్నారు. అయితే ఈసీకి రాజకీయ పార్టీల రుణ మాఫీ హామీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ పేరునూ, ఆయన ఎప్పుడు ఈ లేఖ రాశారనే వివరాలను జైట్లీ వెల్లడించలేదు. నాబార్డ్, సిడ్బీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులోనూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రుణ మాఫీలు, సబ్సిడీలు పరపతి వ్యవస్థను దెబ్బతీసాయని ఆందోళన వ్యక్తం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయం గురించి ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణ దుమారం రేపుతోంది. రైతు రుణమాఫీపై అసలు ప్రభుత్వ ఉద్దేశమేంటనేది జైట్లీ వివరణ ఇవ్వకపోవడం పలు సందేహాలను ముందుకు తెస్తోంది. గతంలోనూ ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ దిగ్గజాలు వ్యవసాయ రుణాల మాఫీపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment