ఆ లావాదేవీలపై కన్ను
కొత్త ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై నిశిత పరిశీలన
న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకం చివరి 10 రోజుల్లో జరిగిన కొన్ని అనుమానాస్పద లావాదేవీల్ని క్షుణ్నంగా విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, ఈ–వాలెట్లకు నగదు బదిలీలు, దిగుమతుల కోసం ముందస్తుగా చేసిన చెల్లింపులపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణ ఖాతాలపై కూడా దృష్టి సారించారు. ‘రూ. 50 వేలకు మించిన డిపాజిట్లకు పాన్ నెంబర్ జత చేయని వారిపై ఐటీ శాఖ చర్యలు మొదలుపెట్టింది’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు.
నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి
ఆర్‌జీటీఎస్, ఇతర పద్ధతుల్లో చేసిన నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి సారించారని, తమ విచారణలో వెల్లడవుతున్న అంశాల్ని సంబంధిత విచారణ సంస్థలతో పంచుకుంటున్నామని చెప్పారు.