చాటింగ్ చేసినా బుక్కయినట్టే?
ఫేస్‌బుక్‌లో చేసే కాజువల్ పోస్టులు, స్నేహితులు, బంధువులతో చాటింగ్‌లో తెలిసోతెలియకో చేసే వ్యాఖ్యలు.. మీ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశముంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వేదికల్లో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే మున్ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. ఇందుకు తాజా నిదర్శనం.. అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన మన హైదరాబాదీ విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ తిప్పిపంపిన ఉదంతమే!
అమెరికాకు వరకు వెళ్లిన మన విద్యార్థులకు చివరినిమిషంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల రూపంలో ఊహించని షాక్ ఎదురైంది. తాము ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకముందే తమ ఉద్దేశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పసిగట్టడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. అమెరికాలో చదువు కోసం వస్తున్నప్పటికీ, అక్కడ ఉద్యోగం వెతుక్కోవాలని భావిస్తున్నామని ఏదో మాటమాటల్లో ఫేస్‌బుక్ చాటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను ఎలా బోల్తా కొట్టించాలనే విషయంలో అమెరికాలోని స్నేహితులు ఇచ్చిన తమకు సలహాలు వంటివి తమను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టించాయని, ఫేస్‌బుక్‌లో ఓరకంగా స్పందించి.. తమ ముందు మరోరకంగా సమాధానం చెప్పడాన్ని అధికారులు ఎత్తిచూపారని పలువురు విద్యార్థులు అంగీకరించారు.
ఫేస్‌బుక్‌లో రసహ్యంగా జరిగిన చాటింగ్ సమాచారం కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు సేకరించడం.. ఎంతవరకు నైతికమన్న చర్చ కొనసాగుతున్నప్పటికీ.. విద్యార్థులు అసలు అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో అన్నదానిని, వారి ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మాత్రం ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి సోషల్ మీడియా అకౌంట్లు, పోస్టులు, చాటింగ్‌లపై నిఘా పెట్టారన్నదని స్పష్టమవుతున్నది. విద్యార్థులు చాలామందిలో స్పష్టత లేదని, వారు ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెడుతున్నారని భావించి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పిపంపడం వివాదం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లే విద్యార్థులకు తమ అభ్యసించే కోర్సు, అది అందించే యూనివర్సిటీ, దాని నేపథ్యం, చదువుతున్నకాలంలో అక్కడి ఖర్చులు ఎలా భరిస్తారు? భారత్‌లో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమిటి? అన్న విషయాల్లో స్పష్టత ఉండాల్సిన అవసరముంది. వీటి గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు కచ్చితంగా అడుగుతారు.
విద్యార్థులను ఎందుకు తిరస్కరించారు?
- స్పష్టమైన, సమర్థమైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం
- ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఆత్మవిశ్వాసం చూపకపోవడం
- చెప్పిన చిన్నచిన్న విషయాల పట్ల కూడా నిబద్ధంగా ఉండకపోవడం
- సమర్పించిన పత్రాలు వైరుద్ధ్యాలు ఉండటం
నిపుణులేం చెప్తున్నారు?
విద్యార్థుల ప్రొఫైల్‌ను పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి అధికారులు ఫేస్‌బుక్ వంటి బహిరంగ వేదికలపై విస్తృతంగా ఆధారపడుతున్నారు. ఫేస్‌బుక్ అనేది ఒక విద్యార్థి స్వభావానికి ముఖచిత్రమని, దీనిని వినియోగించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పుడు ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇందుకు సన్నద్ధమయ్యేందుకు ముందే ఫేస్‌బుక్‌లోని తమ ఖాతాలను సమూలంగా ప్రక్షాళన చేసి.. పనికిమాలిన విషయాలను తొలగించాలని, రాజకీయ అభిప్రాయాలు, ఇతరుల పోస్టులపై పెట్టిన కామెంట్లు, చాటింగ్‌లు వంటి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా వారు అనుసరించే పేజీలు, గ్రూపులనూ పరిశీలించే అవకాశముంటుందని, కాబట్టి ఈ విషయంలో ఉద్యోగార్థులు, ఉద్యోగార్థులు అత్యంత అప్రమత్తంగా ఉంటూ.. తమ విద్య, ఉద్యోగాలకు అవసరయ్యే గ్రూపులు, పేజీలతో మాత్రమే ఫేస్‌బుక్‌లో టచ్ ఉండాలని సూచిస్తున్నారు.
స్పష్టతే విజయం!
హైదరాబాదీ విద్యార్థులతోపాటు అమెరికా వెళ్లిన శశి దిగ్విజయంగా ఇమ్మిగ్రేషన్ అధికారుల పరీక్షలను అధిగమించి.. ఇప్పుడు నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ (ఎన్పీయూ)లో సివిల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఎన్సీయూలోనే ఎందుకు చేరాలనుకుంటున్నావు, కుటుంబనేపథ్యం, ఆదాయమార్గాలు ఏమిటి వంటి అంశాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో స్పష్టమైన సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. అధికారులు ఇచ్చిన లెక్కలను చేసి.. అతను తన కలను సాకారం చేసుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ దొరికిన శశి ఇప్పుడు ఫోర్మెంట్‌లో ఉంటున్నాడు.