పాక్‌తో చర్చలకు ఫేస్‌బుక్‌లో ఉద్యమం
భారత విదేశాంగ దౌత్య విధానాన్ని ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా మార్చగలదా? పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై టెర్రరిస్టుల దాడి కారణంగా సందిగ్ధంలో పడిన భారత-పాక్ చర్చల ప్రక్రియను పునరుద్ధరించగలదా? దాయాదుల లాంటి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులను కోరుకుంటున్నామని, అందుకు చర్చలే పరిష్కారమని ఆశిస్తున్నామంటూ సరిహద్దులకు ఇరువైపులున్న ఫేస్‌బుక్ యూజర్లు పెద్ద ఉద్యమాన్నే చేపట్టారు.
'ప్రొఫైల్ ఫర్ పీస్' అనే నినాదంతో వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. శాంతిసూక్తులు రాసిన ప్లకార్డులను పట్టుకొని దిగిన ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ముంబై నివాసి రామ్ సుబ్రమణియం ముందుగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 'ఎవరో కొద్ది మంది హింసావాదుల చర్యకు మమ్మల్ని బలిచేయొద్దు. ఆ చర్య కారణంగా మా భవిష్యత్తును నిర్దేశించవద్దు. మేము శాంతిని కోరుకుంటున్నాం. టెర్రరిస్టులను చంపండి, చర్చలను కాదు' అన్న వ్యాఖ్యలతో ఆయన తన ఫొటోను పఠాన్‌కోట్ ఆపరేషన్ ముగిసిన వెంటనే పోస్ట్ చేశారు. అలా మొదలైన ఈ ఉద్యమం వేగంగా ఫేస్‌బుక్‌లో విస్తరించింది. పాకిస్తాన్ నుంచి కూడా యూజర్లు ఈ ఉద్యమానికి భారీ సంఖ్యలో మద్దతు పలుకుతున్నారు.
'ఓ భారత్, పాకిస్తాన్ నేతల్లారా! యుద్ధం అంటే శాంతిమృగ్యం అని అర్థం కాదు. న్యాయం జరక్కపోవడం. మెదళ్లు పుచ్చిపోయిన కొంత మంది చర్యలకు లొంగవద్దు. ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది మీరే. నాలాగా ఈ భూమ్మీద ఎంతోమంది శాంతిని కోరుకుంటున్నారు' ... అని న్యూయార్క్‌కు చెందిన ఓ హక్కుల సంస్థలో పనిచేస్తున్న రఫీక్ కట్వారియా తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫొటోను పోస్ట్ చేశారు. 'విద్వేషానిది ఎప్పుడూ విజయం కాకూడదు. ఇప్పుడు మీరు సుస్థిర శాంతి కోసం తీసుకునే చర్యలకు మా భవిష్యత్ తరాలు మీకు రుణపడి ఉంటాయి' అని ఢిల్లీ నివాసి, ఓ టెక్నాలజీ సంస్థ యజమాని సమీర్ గుప్తా తన ఫ్రొఫైల్‌లో వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య శాంతిని కోరుకుంటూ పాడిన పాట వీడియోను కూడా పోస్ట్ చేశారు. 'టెర్రరిజాన్ని చంపండి చర్చలను కాదు' అంటూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా పాకిస్తాన్ జర్నలిస్ట్ బీనా సర్వార్ పిలుపునిచ్చారు. ఇలా ఫేస్‌బుక్ యూజర్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు.
ముందస్తు నిర్ణయం ప్రకారం భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల మధ్య ఈ నెల 15న చర్చలు జరగాల్సి ఉంది. పఠాన్‌కోట్ పరిణామం నేపథ్యంలో చర్చలపై ప్రతిష్టంభన ఏర్పడింది. పాక్ సరిగా స్పందిస్తే తప్ప ఆ దేశంతో చర్చలు ఉండబోవని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. మరోవైపు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం నాడు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. చర్చల సారాంశం మాత్రం వెలుగులోకి రాలేదు.