
సీఎం హెలికాప్టర్ ప్రమాదానికి పైలటే కారణం!
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదానికి గురవ్వడానికి పైలట్ బాధ్యుడని సాంకేతిక నిపుణులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదానికి గురవ్వడానికి పైలట్ బాధ్యుడని సాంకేతిక నిపుణులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. లాతూర్ జిల్లా నిలంగా ప్రాంతంలో గత నెల 25న ఓ కార్యక్రమంలో పాల్గొని ముంబైకి తిరిగి వస్తుండగా ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన నిమిషంలోనే ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అయితే ఇందుకు గల కారణాలను వెలికితీసేందుకు ప్రభుత్వం సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించింది. ఆ రోజు హెలికాప్టర్‌పై సామర్థ్యానికి మించి భారం పడడంతోపాటు.. భద్రతాపరమైన నియమాలను పైలట్ పాటించలేదని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) స్పష్టం చేసింది. ‘హెలిప్యాడ్‌కు అతి దగ్గరలో ఉన్న విద్యుత్ వైర్లు, స్తంభాలపై శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత పైలట్‌పై ఉంటుంది. కానీ ఆరోజు వాటి గురించి పైలట్ పట్టించుకోలేదు. హెలిప్యాడ్ స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో హెలికాప్టర్ టేకాఫ్ అవ్వగానే ఒక్కసారిగా గాలిలో దుమ్ముధూళి లేవడంవల్ల పైలట్ గందరగోళానికి గురయ్యాడు. దీని వల్ల పైలట్‌కు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం, వైర్లు కనిపించలేదు. అంతేగాక లాతూర్ జిల్లా వాతావరణాన్నిబట్టి హెలికాప్టర్‌పై సామర్థ్యానికన్నా తక్కువ భారం ఉండేలా చూడాల్సి ఉంది’ అని ప్రాథమిక దర్యాప్తులో ఏఏఐబీ వెల్లడించింది.