జీఎస్‌టీ బిల్లుపై ముందడుగు | farward step in GST | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ బిల్లుపై ముందడుగు

Published Sat, Nov 28 2015 2:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

జీఎస్‌టీ బిల్లుపై ముందడుగు - Sakshi

జీఎస్‌టీ బిల్లుపై ముందడుగు

సోనియా, మన్మోహన్‌లతో ప్రధాని మోదీ భేటీ
బిల్లుపై ప్రతిష్టంభన తొలగించేందుకు విపక్ష నేతలతో చర్చలు
కాంగ్రెస్ డిమాండ్లు రెండింటికి ప్రభుత్వం అంగీకారం?
18% గరిష్ట పరిమితికి ఓకే.. అంతర్రాష్ట్ర రవాణాపై అదనపు పన్ను లేదు!
పార్టీలో అంతర్గతంగా చర్చించి చెప్తామన్న కాంగ్రెస్ అధినాయకత్వం
‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్న అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు

 
న్యూఢిల్లీ: వస్తువులు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై ప్రభుత్వం - ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో తొలగిపోతున్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రధాని శుక్రవారం రాత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లతో సమావేశమై జీఎస్‌టీ బిల్లుపై చర్చించారు. మోదీ ఆహ్వానంతో ప్రధాని నివాసానికి చేరుకున్న సోనియా, మన్మోహన్‌లు ఆయనతో దాదాపు 45 నిమిషాల పాటు ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా జీఎస్‌టీ బిల్లుపై ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం తమ తమ వైఖరులను విశదీకరించాయి. బిల్లు విషయంలో కాంగ్రెస్ లేవనెత్తిన మూడు అభ్యంతరాలపై ప్రభుత్వం తన స్పందన తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానానికి ఉద్దేశించిన జీఎస్‌టీ గరిష్ట పరిమితి 18 శాతమే ఉండాలని.. రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తువులపై అదనంగా ఒక శాతం పన్ను వద్దని, రాష్ట్రాలు తమ రెవిన్యూ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఐదేళ్లపాటు వాటికి వంద శాతం పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండడం తెలిసిందే.
 
ఇందులో జీఎస్‌టీని గరిష్టంగా 18 శాతానికే పరిమితం చేయటానికి, రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తువులపై ఒక శాతం అదనపు పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు.. మోదీ, సోనియా, మన్మోహన్‌ల భేటీ అనంతరం టీవీ చానళ్లలో వార్తలు వెలువడ్డాయి. అయితే.. జీఎస్‌టీ అమలుతో ఆదాయం నష్టపోతున్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు నూరు శాతం పరిహారం అంశంతో పాటు.. రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీలో వివాదాలను పరిష్కరించటానికి రాజ్యాంగ హోదాతో స్వతంత్య్ర వ్యవస్థను నెలకొల్పాలన్న కాంగ్రెస్ మరో డిమాండ్ పైనా ప్రభుత్వం తన వైఖరిని వివరించినట్లు సమాచారం. ఆయా అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని స్పందిస్తామని కాంగ్రెస్ నాయకత్వం తెలియజేసింది. మొత్తం మీద కాంగ్రెస్ డిమాండ్లలో కొన్నిటికి ప్రభుత్వం ఓకే చెప్పటంతో పార్లమెంటు సీతాకాల సమావేశాల్లో కీలకమైన జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి ముందడుగు పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.
 
మోదీ తొలిసారి నేరుగా: ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక చొరవ తీసుకుని ప్రధాన విపక్షాన్ని నేరుగా సంప్రదించడం ఇదే తొలిసారి. ప్రస్తుత సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం కోసం ఆయన ఈ భేటీ జరిపారు. రేస్‌కోర్స్ రోడ్డులోని తన నివాసంలో తేనీటి విందుకు సోనియా, మన్మోహన్‌లను ఆహ్వనించిన ఆయన వారితో పార్లమెంట్‌లో పెండింగులో ఉన్న అంశాలు.. గత రెండు సమావేశాల నుంచి పెద్ద సంఖ్యలో పేరుకుపోయిన బిల్లులపై చర్చించారు. భేటీ అనంతరం వివరాలను జైట్లీ మీడియాకు తెలిపారు. ‘బిల్లు చరిత్ర, నేపథ్యం, విపక్ష అభ్యంతరాలపై ప్రభుత్వ స్పందనను వారికి వివరించాం. కాంగ్రెస్ నేతలు ఇక అంతర్గతంగా చర్చిస్తారు. తర్వాత ప్రభుత్వం వారిని సంప్రదిస్తుంది. మేం కూడా వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నాం’ అని తెలిపారు. పెండింగులో ఉన్న కొన్ని బిల్లుపై ముందుకు సాగేందుకు వెంకయ్యనాయుడు లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తారని వెల్లడించారు. జీఎస్‌టీ బిల్లు రాజ్యసభలో పెండింగులో ఉండడం, ప్రభుత్వానికి ఆ సభలో మెజారిటీ లేకపోవడం తెలిసిందే.
 
పన్నుపై పరిమితి ఉండాలి: రాహుల్
జీఎస్‌టీ విషయంలో బీజేపీకి సహకరించేందుకు తమ పార్టీ సిద్ధమని, అయితే ఆ పన్నుపై పరిమితి ఉండాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పేదప్రజలపై పన్ను భారం పడొద్దన్నది తమ అభిమతమని శుక్రవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో పేర్కొన్నారు. ప్రధాని మోదీ.. ప్రజల ఒత్తిడితోనే జీఎస్టీపై చర్చకు సోనియా, మన్మోహన్ సింగ్‌లను ఆహ్వానించారని, అలా కాకుండా సహజంగానే విపక్షాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement