అఫ్జల్, ఇష్రత్ పై రగడ
మోదీపై కక్షసాధింపుకోసమే: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడిచేసి అఫ్జల్ గురుపై చిదంబరం చేసిన వ్యాఖ్యలు, ఇషత్ ్రజహాన్ ఎన్‌కౌంటర్‌పై మాజీ హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును కుదిపేశాయి. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీపై రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడేందుకు కాంగ్రెస్ కుటిలయత్నాలు చేసిందంటూ బీజేపీ లోక్‌సభలో ఎదురుదాడి చేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద సమర్పణ చర్చ మొదలుపెట్టిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. అఫ్జల్ గురు ఉరిశిక్ష విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని ఓ టీవీ చానల్‌లో మాజీ హోం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి తోడు కేంద్ర మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లై.. 2004లో ఎన్‌కౌంటర్ అయిన ఇషత్ ్రజహాన్ ఓ లష్కరే ఉగ్రవాదని తెలిసినా.. రాజకీయ ఒత్తిళ్లతో ఆ విషయాన్ని దాచిపెట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని వెల్లడించటాన్ని అనురాగ్ ఠాకూర్ ఆయుధంగా మలుచుకుని విపక్షంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘మోదీని రాజకీయంగా ఎదుర్కొనలేక.. కక్షసాధింపుకోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా?’ అని ధ్వజమెత్తారు. ఇంతకూ అఫిడవిట్ మార్చిందెవరో చెప్పాలని కాంగ్రెస్ బెంచీలవైపు చూస్తూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్‌లపై అనురాగ్ ఠాకూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. మల్లికార్జున ఖర్గే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ పదాలను రికార్డులనుంచి తొలగించాలని కోరారు. ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలు ఖర్గేకు మద్దతుగా నిలిచాయి.