
బాలచందర్‌కు అంతిమ వీడ్కోలు
* శోకసంద్రంలో దక్షిణాది సినిమా
* అంజలి ఘటించిన తారాలోకం
సాక్షి, చెన్నై: దక్షిణాది సినీదర్శక దిగ్గజం బాలచందర్ భౌతికకాయానికి బుధవారం సాయంత్రం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు మైలాపూర్‌లోని బాలచందర్ స్వగృహంలో ఆయన భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. శోకతప్తులైన అభిమానులతో ఆ ప్రాంతం నిండిపోయింది. డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు.
నటులు రజనీకాంత్, శరత్‌కుమార్, విజయకాంత్, విజయ్, కార్తి, ధనుష్, శివకుమార్, సీనియర్ నటి రాజశ్రీ, రాధిక, సరిత, సుహాసిని, నిరోషా, లతా రజనీకాంత్, ఐశ్వర్య ధనుష్, వై.విజయ, సరస్వతి, దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్, శంకర్, మణిరత్నం, ఇళయరాజా, ఎ.ఆర్.రెహ్మాన్, అర్జున్ తదితరులు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ముంబయి నుంచి నటి జయప్రద ప్రత్యేకంగా చెన్నైకి వచ్చి బాలచందర్‌కు నివాళులర్పించారు. అయితే అమెరికాలో ఉత్తమవిలన్ చిత్ర నిర్మాణంలో ఉన్న కమల్‌హాసన్ తన గురువు కడసారి చూపునకు నోచుకోలేకపోయారు.
నాకు గురువు కాదు దేవుడు: రజనీకాంత్
‘‘దర్శక దిగ్గజం బాలచందర్ నాకు గురువు కాదు, దేవుడు. ఆయన మృతితో నన్ను నేను కోల్పోయూను. ఇది నా జీవితంలో ఎప్పటికీ తీరని లోటు’’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ అవార్డు నందించారు: అరవింద్
బాలచందర్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, తన తండ్రి ఆయన దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘‘మా కుటుంబానికి రుద్రవీణ చిత్రంతో జాతీయ అవార్డును అందించిన దర్శకుడు కె.బాలచందర్. అలాంటి రుద్రవీణ నేడు మూగబోయింది’’ అన్నారు. బాలచందర్ చిత్రం ‘అరంగేట్రం’ చూశాక డైరీలో బాలచందర్ గారి అడ్రసు చూసి ఆయన ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. ‘నన్ను కూర్చోబెట్టి వచ్చిన విషయం చెప్పమని అడిగారు. అరంగేట్రం చిత్రం నాకు ఎంతగానో నచ్చిందని చెప్పాను. నా విచక్షణను బాలచందర్ మెచ్చుకున్నార’ని అరవింద్ అన్నారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్ర నిర్మాణానికి ముందు బాలచందర్‌ను కలిసి మీ ‘బొమ్మా బొరుసా’ చిత్రాన్నే ఆ చాయలు లేకుండా తీస్తున్నట్టు మరోసారి కలసి చెప్పానన్నారు. అదే చిత్రాన్ని తమిళంలో మాప్పిళై పేరుతో రీమేక్ చేసి విజయం సాధించినప్పుడు ఆయన్ని కలసినట్టు తెలిపారు.
నాకు తండ్రిలాంటి వారు: నటి జయప్రద
‘‘కె.బాలచందర్ నాకు తండ్రి లాంటివారు. ఆయన చాలా మితభాషి. సెట్‌లోకొస్తే ఎప్పుడూ ఏదో కొత్తగా చెయ్యాలని తపించేవారు’’ అని ప్రముఖనటి జయప్రద అన్నారు. బాలచందర్ సెట్‌లోకి వస్తున్నారంటే రజనీ, కమల్‌లతో సహా అందరం ఉత్కంఠతో ఎదురుచూసేవాళ్లమన్నారు. ‘‘ఆయనంటే మాకెంతో గౌరవం. ఆయన గట్టిగా అరిస్తే ఏడ్చేసేదాన్ని.. నటనలో ఎక్కడా శిష్యరికం చెయ్యకపోయినా బాలచందర్ స్కూల్లో చాలా నేర్చుకున్నాం. అలాంటి ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.