సాక్షి, షిల్లాంగ్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయాలో పాలక కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5గురు ఎమ్మెల్యేలతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ భాగస్వామ్య పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)లో చేరారు. గురువారం షిల్లాంగ్‌లో జరిగిన ఎన్‌పీపీ ర్యాలీలో ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. వీరితో పాటు గిరిజన ప్రతిపత్తి జిల్లా మండళ్లకు చెందిన పదిమంది సభ్యులూ పార్టీలో చేరారని ఎన్‌పీపీ ప్రతినిధి జేమ్స్ కే సంగ్మా వెల్లడించారు.
ఎన్‌పీపీలో చేరిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ డిప్యూటీ సీఎం రోవెల్ లింగ్డో, షెబ్లాండ్ దార్, యెంబన్, ప్రెస్టోన్ త్యాన్సాంగ్, నాత్లాంగ్ ధార్ ఉన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను స్వాగతిస్తున్నామని, తమ తండ్రి పీఏ సంగ్మా ఆశయ సాధన దిశగా పయనిస్తామని ఎన్‌పీపీ అధ్యక్షుడు సీకే సంగ్మా పేర్కొన్నారు. మేఘాలయాలో మార్పు దిశగా ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment