
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని భగ్గుమనడంతో అడుగడుగునా ట్రాఫిక్ జామ్ ప్రయాణీకులకు చుక్కలు చూపుతోంది.
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారుల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. పలు ప్రాంతాల్లో ఆందోళనలతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఢిల్లీ-గుర్గావ్ రహదారిపై దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణీకులు సకాలంలో చేరుకోలేకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 21 విమానాలు రద్దయ్యాయి. 16 విమానాల్లో జాప్యం నెలకొంది. ఇండిగో 19 విమానాలను రద్దు చేయగా, స్పైస్‌జెట్, ఎయిర్‌ఇండియా ఒక్కో విమానాన్ని రద్దు చేశాయి.
పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిరసనల నేపథ్యంలో విమానాలను మిస్ అయిన ప్రయాణీకులకు ఎలాంటి క్యాన్సిలేషన్ చార్జ్‌లను విధించడం లేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరోవైపు పౌర చట్టంపై ఢిల్లీ భగ్గుమంది. పెద్దసంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి చేరుకుని నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనల నేపథ్యంలో 16 మెట్రో స్టేషన్‌లను మూసివేసిట్టు ఢిల్లీ మెట్రో ప్రకటించింది. ఇక సుభాష్ మార్గ్, రెడ్‌ఫోర్ట్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీస్ ఆంక్షలున్నా పట్టించుకోకుండా ఎర్రకోట వద్ద పెద్దసంఖ్యలో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు.