నటి రమ్యకు కాంగ్రెస్ కీలక పదవి
నటి రమ్యకు కాంగ్రెస్ కీలక పదవి
Published Thu, May 11 2017 8:42 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ : ప్రముఖ కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ రమ్యకు కాంగ్రెస్ కు కీలక పదవికి కట్టబెట్టేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ డిజిటల్ కమ్యూనికేషన్స్ కు కొత్త అధినేతగా, సోషల్ మీడియా, ఐటీ బాధ్యతలను రమ్యను అప్పజెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కన్నడ సినిమాల్లో ప్రముఖ నటిగా రమ్యకు పేరుంది. 2012లో రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత మాండ్య నియోజకవర్గానికి ఎంపీగా బాద్యతలు నిర్వర్తించారు. ట్విట్టర్ లో రమ్యకు 4,83,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐటీ వింగ్ ను స్థాపించి, ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతున్న దీపిందర్ హూడా స్థానంలో రమ్యను నియమించనున్నట్టు తెలుస్తోంది. ముందస్తు కంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రదర్శన మెరుగుపడిందని, దాన్ని ఇంకా పుంజుకునేలా చేయాలని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దానికి సరియైన వ్యక్తి హూడా కాదని తెలిపాయి.
మరింత దూకుడుగా, వూహ్యత్మకంగా ఉండేవారిని సోషల్ మీడియా చీఫ్ గా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందని, దీనికి రమ్య సరైన వ్యక్తిగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య చేస్తున్న ట్వీట్లు ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే, ఇరకాటంలో పడేసేవి ఉంటున్నాయి. గత నెల చత్తీస్ ఘడ్ లో సుక్మాలో జరిగిన నక్సల్స్ దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై రమ్య చేసిన ట్వీట్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. హోమంత్రి పదవిలో ఉన్నారా? లేరా? ఇంటెల్ ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వంతో ఎవరూ సురక్షితంగా లేరు. ఆర్మీ కానీ, ప్రజలు కానీ, కనీసం ఆధార్ వివరాలు కూడా భద్రంగా లేవంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రమ్య 2017 ఏప్రిల్ 24న ఓ ట్వీట్ చేశారు. గతేడాది ఆగస్టులో కూడా ఆమె వివాదాస్పదమైన ట్వీట్ చేసి, దుమారం రేపింది. పాకిస్తాన్ నరకం కాదని, అది మంచి దేశమని పేర్కొంటూ రక్షణ మంత్రి పారికర్ కామెంట్లను తోసిపుచ్చిన రమ్య చేసిన ట్వీట్ పై రాజద్రోహం కేసు కూడా నమోదైంది.
Advertisement
Advertisement