
భగవత్ లేరుగా.. పవారే రాష్ట్రపతిగా..!
నిత్యం ఏదో ఒక ఇరుకున పెట్టే బీజేపీ భాగస్వామ్య పార్టీ శివసేన అనూహ్య ప్రతిపాదన చేసింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలంటూ తాజాగా తెరమీదకు తెచ్చింది.
ముంబయి: నిత్యం ఏదో ఒక ఇరుకున పెట్టే బీజేపీ భాగస్వామ్య పార్టీ శివసేన అనూహ్య ప్రతిపాదన చేసింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలంటూ తాజాగా తెరమీదకు తెచ్చింది. తాము పవార్‌కు మద్దతు ఇస్తున్నామని, తమ భాగస్వామి అయిన బీజేపీ కూడా ఆయనకు మద్దతివ్వాలని కోరింది. శివసేన పార్టీ నేత సంజయ్ రావత్ దీనిపై మాట్లాడుతూ రాష్ట్రపతి పదవిని అలంకరించడానికి పవార్ తగిన వ్యక్తి అని, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, జేడీయూ తదితర పార్టీలు కూడా పవార్‌కు పరోక్షంగా మద్దతిస్తున్నాయని కూడా పేర్కొన్నారు.
ప్రజా మద్దతు ఎక్కువగా ఉన్న తదుపరి నేత పవార్ మాత్రమేనని ఆయనకు మద్దతివ్వాలని వారంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రకటించనున్న రాష్ట్రపతి అభ్యర్థికి సవాలుగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో తమ పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే పలు చర్చల్లో పాల్గొన్నప్పుడు పవార్‌కే చాలామంది మద్దతిచ్చారని, అలాగే, దేశంలో కూడా ప్రజా మద్దతు ఉన్న నాయకుడు పవార్ అని అన్నారు. అయితే, తొలి ప్రాధాన్యం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కేనని, తాను రేసులో లేనని ప్రకటించినందున తమ తదుపరి ప్రాధాన్యం పవార్‌కే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, దీనిపై ఇంకా పవార్, ఎన్సీపీ స్పందించాల్సి ఉంది.