విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త!
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త! ఇకపై తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లను విదేశాల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కొత్తగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నారైలు, విదేశీయులు భారత్ పర్యటనకు వచ్చేముందు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఇండియాలోని తమ బంధువులు, టూర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఈ పరిస్థితిలో మార్పులు చేర్సులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్ సైట్ లో అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం కల్పించింది.
విదేశీ ప్రయాణీకులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడటమే లక్ష్యంగా కొత్త టికెట్ బుకింగ్ వ్యవస్థను భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కొత్త పద్ధతిలో విదేశీయులు, ఎన్నారైలు తమకు ఫారిన్ బ్యాంకులు అందించిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 'ప్యాలెస్ ఆన్ వీల్స్' , 'మహరాజా' వంటి లగ్జరీ ట్రైన్లు, విదేశీయుల పర్యటనలకు అనువుగా ఉండే ఇతర టూరిస్ట్ స్పెషల్ ట్రైన్లతోపాటు, సాధారణ సర్వీసుల్లో కూడ ఈ కొత్త అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటువంటి అంతర్జాతీయ లావాదేవీలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ప్రత్యేక అవకాశం కల్పించడం ఇది రెండోసారి. క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని గమనించిన ఐఆర్ సీటీసీ మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని అప్పట్లో రద్దు చేసింది. ప్రస్తుతం హ్యాకింగ్ వంటి సమస్యలు ఎదురు కాకుండా వెబ్ సైట్ లో భద్రతను మరింత పటిష్ఠ పరచి ముందుగానే అన్నిరకాల పరిశీలనలు పూర్తయిన తర్వాతే టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
నిమిషానికి 15,000 బుకింగ్స్ ను చేసే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ... సెకనుకు 250 టికెట్లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 58 శాతం టికెట్లు ఆన్ లైన్ లోనే అమ్మకాలు జరుగుతుండటం విశేషం. కాగా ప్రస్తుతం ఐఆర్ సీటీసీ అందిస్తున్న కొత్త సదుపాయం ఏప్రిల్ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.