బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) ఇక లేరు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుష్మా మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. విద్యార్థి సంఘం నాయుకురాలిగా రాజకీయ అరంగ్రేటం చేసిన ఆమె.. అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సుష్మా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా...మంచి మనసున్న నాయకురాలిగా ప్రజలకు దగ్గరయ్యారు.
మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఆమె చేసిన సహాయాలే. ప్రధాని మోదీ తర్వాత అంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన సుష్మా స్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. సుష్మాస్వరాజ్ ఏబీవీపీ నాయకురాలిగా 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి..1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో బళ్లారిలో సోనియాపై పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రిపై పోటీచేసి దేశం దృష్టిని ఆకర్షించారు.
2004 ఏప్రిల్‌లో సుష్మా స్వరాజ్ ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000 సెప్టెంబర్ నుంచి 2003 జనవరి వరకు కేంద్రంలో సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. జనవరి 2003 నుంచి మే 2004 వరకు అదనంగా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు పార్లమెంటరీ వ్యవహారాలు బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో 2014 మే 26న కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసి అంతర్జాతీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment