
నిషేధించకపోతే...దూకేస్తా
ఆగ్రా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయ వాది చిమన్ లాల్ జైన్ గాంధీ జయంతి రోజు యమునా నదిలో దూకి ప్రాణ త్యాగం చేస్తానని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లోని తాజ్ సిటీ ఆగ్రాలో మద్యాన్ని నిషేధించకపోతే వచ్చే అక్టోబర్ 2న ఆత్మహత్య చేసుకుంటానన్నారు. మద్యానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆయన, మంగళవారం ఉదయం ఈ ప్రకటన చేశారు.
దాదాపు 600 మంది మహిళలు, పురుషులతో కలిసి ఖతీక్ పారా బస్తీలో మద్యపాన వ్యతిరేక శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. తాజ్ సిటీలో మద్యాన్ని నిషేధించేవరకూ తన పోరాటం ఆగదని చిమన్లాల్ స్పష్టం చేశారు. మద్య వ్యతిరేక ప్రచారానికి సంబంధించి చిమన్ లాల్ రూపొందించిన ఒక కార్యక్రమం ఆకాశవాణిలో మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుందని సామాజిక వేత్త రాజీవ్ సక్సేనా ప్రకటించారు. తాజ్ మున్సిపల్ మ్యూజియానికి తన చరఖాను బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు.