
క్షమాపణ చెబితే సరిపోతుందా....
ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలను గజేంద్ర సింగ్ కుటుంబం తిరస్కరించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, క్షమాపణ చెబితే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దౌసా: ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలను గజేంద్ర సింగ్ కుటుంబం తిరస్కరించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, క్షమాపణ చెబితే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కొడుకును కాపాడటం కేజ్రీవాల్ ఒక్కడి వల్లే సాధ్యంకాకపోతే...కనీసం కార్యకర్తలను, పోలీసులను ఆదేశించి ఉండాల్సిందని గజేంద్ర సింగ్ తండ్రి బనే సింగ్ విమర్శించారు. చనిపోతున్న మనిషిని రక్షించలేకపోవడం ఢిల్లీ ముఖ్యమంత్రికి అవమానమన్నారు. దౌసా జిల్లాలోని నంగల్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ , కేజ్రీవాల్ సహచరులతో కలిసి వైదికపై నుంచి చోద్యం చూశారు తప్ప తన కొడుకును రక్షించే ప్రయత్నం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే తన సొంత పిల్లలు ఆ పరిస్థితిలో ఉండి ఉంటే కేజ్రీవాల్ ఇలాగే చేశావారా అని ఆయన ప్రశ్నించారు.
అయితే ఆప్ ర్యాలీలో గజేంద్ర సింగ్ ఆత్మహత్య సందర్శంగా వెల్లువెత్తిన విమర్శలతో ఇరకాటంలో పడిన కేజ్రీవాల్ తప్పు దిద్దుకునే పనిలో భాగంగా ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత తప్పుచేశాను క్షమించండన్నారు. కార్యక్రమాన్ని కొనసాగించకుండా ఉండాల్సింది. ఎవర్నయినా బాధపెట్టి వుండే మన్నించండంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఆప్ తలపెట్టిన ర్యాలీ రాజస్థాన్ చెందిన 41 సంవత్సరాల గజేంద్రసింగ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించిన అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించడం వివాదాస్పదమైంది. దీనిపై గురువారం పార్లమెంటులో గందరగోళం చెలరేగింది.