పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ జస్వీందర్ సింగ్ రాకీ ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో హత్యకు గురైతే.. పంజాబ్ జైళ్లలో ఉన్న ప్రత్యర్థి డాన్‌లు ఆ వార్తకు ఫేస్‌బుక్‌లో తెగ లైకులు కొట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వానూ ప్రాంతంలో రాకీ హత్యకు గురైనట్లు తెలియగానే పలువురు గ్యాంగ్‌స్టర్ల ఫేస్‌బుక్ పేజీలు మోతెక్కడం మొదలుపెట్టాయి. షేరా ఖుబాన్ అనే మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు ప్రతీకారంగానే రాకీని చంపినట్లు చాలావరకు పేజీలలో కనిపించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం భటిండాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో షేరా మరణించాడు. పోలీసులకు రాకీ సమాచారం ఇవ్వడం వల్లే షేరా మరణించాడని అతడి గ్యాంగ్ సభ్యులు అప్పట్లో ఆరోపించారు.
ఇప్పుడు రాకీ మరణవార్త తెలియగానే నభా జైల్లో ఉన్న వికీ గౌండర్ అనే మరో గ్యాంగ్‌స్టర్ సంబరాలు చేసుకున్నాడు. అతడు తన ఫేస్‌బుక్ పేజీలో కూడా ఈ విషయం గురించి రాశాడు. ''ఇన్నాళ్లకు మా వీరుడు షేరా ఖుబాన్ హత్యకు ప్రతీకారం తీరింది. రాకీ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు. మరో విషయం.. భటిండా ఎస్ఎస్‌పీ స్వపన్ శర్మ నన్ను చంపాలనుకున్నారు. కానీ ఆయన స్నేహితుడు రాకీ చనిపోయాడని ఆయనకు చెప్పాలనుకుంటున్నా'' అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
నభా జైల్లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ రంజోధ్ జోధా కూడా దీనిపై ఫేస్‌బుక్ కామెంట్ రాశాడు. ''మీరు మాలో ఒకరిని చంపితే.. మేం చాలామందిని చంపుతాం.. ఈ విషయం చరిత్రలో రుజువైంది'' అన్నాడు. తనను తాను షార్ప్‌షూటర్‌గా చెప్పుకొనే దీప్ సంధూ కూడా షేరా ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే రాకీ నేలకొరిగినట్లు ఫేస్‌బుక్‌లో రాశాడు. అయితే జైళ్లోల ఉన్నవాళ్లు కూడా ఫేస్‌బుక్‌లలో అప్‌డేట్లు చేయడాన్ని బట్టి.. జైళ్లలో సెల్‌ఫోన్ల వాడకం ఎంత పెరిగిపోయిందో అర్థమవుతుంది.
జైల్లోంచి కూడా ఫేస్‌బుక్ అప్‌డేట్లు!
Published Mon, May 2 2016 2:29 PM | Last Updated on Thu, Jul 26 2018 12:50 PM
Advertisement
Advertisement