'యోగాతో కశ్మీర్ సమస్యకు పరిష్కారం'
జమ్ము: యోగా సాధన ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలమని, తద్వారా జఠిలమైన కశ్మీర్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని జమ్ముకశ్మీర్ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అన్నారు. శనివారం జమ్ములో మీడియాతో మాట్లాడిన ఆయన వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీషా గిలానీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
'గిలానీకి నా సలహా ఏమంటే ప్రతి రోజు యోగా చేయమని. యోగా సాధన ద్వారా ఏది సరైన నిర్ణయమో, ఏది తప్పుడు నిర్ణయమో తెలుసుకోగలిగే జ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు కశ్మీర్ సమస్యకు పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది' అని లాలా సింగ్ అన్నారు. యోగాను వ్యతిరేకించేవారికి అసలు ఇస్లాం గురించే తెలియదని, అలాంటి వాళ్లందరూ మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. కశ్మీర్ లోని అన్ని జిల్లాలు, గ్రామ స్థాయిల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని, జమ్ములోని గుల్షన్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాన వేడుకకు 5వేల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉదని చెప్పారు. ఉధంపూర్ జిల్లాలోని మంతలాయి ప్రాంతాన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.