
సాక్షి, న్యూఢిల్లీ : వైమానిక దాడులతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన దళాలను రాజకీయ పార్టీలు అభినందనల్లో ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం భారత సేనల సామర్ధ్యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి సైన్యం చేపట్టే చర్యలను తాము ఎల్లప్పుడూ సమర్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
నేడు జరిగిన వైమానిక దాడులు నేరుగా ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా సాగుతూ ఉగ్రమూకలను మట్టుబెట్టి విజయవంతంగా తిరిగి భారత్ పోస్టులకు సైన్యం చేరుకుందని ఆజాద్ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులకు వైమానిక మెరుపు దాడులు జరిగిన తీరును విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన దళం మిరేజ్ యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment