పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్‌లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు.
స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్‌ను మాత్రమే తీసుకుని, గోల్డ్‌మెడల్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు.
కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment