విమానంలో కిలో బంగారం స్వాధీనం
పనాజి(గోవా): ఎయిరిండియా విమానంలో భారీగా బంగారం బయటపడింది. రోజువారీ విధుల్లో భాగంగా గోవా విమానాశ్రయంలో ఏఐ-994 విమానాన్ని ఇంటెలిజెన్స్ సిబ్బంది శుక్రవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విమానంలోని ఓ సీటు వెనుకభాగంలో అతికించి ఉన్న కవర్ కనిపించింది. దానిని తెరిచి చుడగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు.
సుమారు 1280 గ్రాముల బరువున్న 11 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.34 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ బంగారం తమదేనంటూ రాలేదని చెప్పారు. ఈ నెలలో ఇటువంటి ఘటన జరగటం ఇది ఏడోసారి అని సిబ్బంది వివరించారు. తనిఖీల్లో దొరికిపోతానేమో అన్న భయంతో స్మగ్లింగ్ చేసిన వ్యక్తి బంగారాన్ని ఇలా సీటుకు అతికించి వెళ్లి ఉండొచ్చునని భావిస్తున్నారు.