శోకసంద్రం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే (64) ఆకస్మిక మరణం రాష్ట్రాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయాన్ని పురస్కరించుకొని ఆయన స్వస్థలం బీడ్‌జిల్లాలో మంగళవారం నిర్వహించాల్సిన విజయోత్సవం ర్యాలీ కోసం ఢిల్లీ నుంచి బయల్దేరగా, మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆయనను బలితీసుకుంది. 1949లో జన్మించిన ముండే కాలేజీ రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాలొన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఉత్థానపతనాలను చవిచూశారు.
నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియాతో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించిన ఈ సీనియర్ నాయకుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప-ముఖ్యమంత్రి సహా ఎన్నో పదవులను అలంకరించారు. కేంద్రమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించినా, ఆయన మనసంతా రాష్ట్ర రాజకీయాలపైనే ఉండేది. ఈ ఏడాది చివరన జరగాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహాకూటమికి సారథ్యం వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కావాలన్న తన కల సాకారమయయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన ఆకస్మికంగా మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది.
అంచలంచెలుగా అత్యున్నతస్థాయికి
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గోపీనాథ్ ముండే అంచెలంచెలుగా ఎదుగుతూ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ ఎంపికయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. ముండే బీడ్ జిల్లా పర్లీ గ్రామంలో జన్మించారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్తను బీడ్‌వాసులు జీర్ణించుకోలేకపోయారు. మంగళవారం ఉదయం ఆయన బీడ్‌కు రావాల్సి ఉంది. ముండే మరణవార్తను మొదట చాలా మంది నమ్మలేదు. నిజమేనని తెలుసుకుని ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మార్కెట్లు, దుకాణాలు, ఇతర సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
ముండే కుటుంబం..
1949 డిసెంబరు 12న బీడ్ జిల్లా నత్రా గ్రామంలో పాండురంగ్, లింబాబాయి ముండే దంపతులకు గోపీనాథ్ జన్మించారు. తరువాత పర్లీ గ్రామంలో స్థిరపడ్డారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన బీజీపీ సీనియర్ నాయకుడు, దివంగత ప్రమోద్ మహాజన్ సోదరి ప్రజ్ఞను 1978లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు పంకజ, ప్రతిమా, యశశ్రీ సంతానం. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా నత్రా గ్రామంలోనే జరిగింది. కళాశాలలో చదువుతుండగానే మిత్రులతో కలిసి స్థానిక రాజకీయాలు, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. మరఠ్వాడా యూనివర్సిటీ, పుణే యూనివర్సిటీలో బీకాం, బీజీఎల్ చదివారు. కూతుళ్లలో పంకజ ఎమ్మెల్యేగా, ప్రతిమ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. యశశ్రీ లా చదువుతోంది.
రాజకీయ అరంగేట్రం..: కాలేజీలో చదువుతుండగానే ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో ప్రవేశించారు. 1978లో మొదటిసారి శాసన సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1980లో భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1980లో రేణాపూర్ నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీకి వెళ్లారు. 1985లో కాంగ్రెస్‌కు చెందిన పండిత్‌రావ్ దౌండ్ చేతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 1990లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి ప్రతిపక్ష పదవి కోల్పోవడంతో ముండేకు అసెంబ్లీ విపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారు.
1990-95 మధ్య కాలంలో అండర్‌వరల్డ్ డాన్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తారు. 1995-99 మధ్య కాలంలో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయ కూటమి ప్రభుత్వంలో ఉప-ముఖ్యమంత్రిగా ముండే పదవీ బాధ్యతలు చేపట్టారు. హోం, విద్యుత్‌శాఖలను ఎంతో సమర్థంగా నిర్వర్తించారు. ముండే హయాంలో అత్యధికంగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. రాష్ట్రంలో నేరసామ్రాజ్యాన్ని కుప్పకూల్చారు. 2009లో బీడ్ జిల్లా నియోజకవర్గం మొదటిసారి లోక్‌సభ ఎన్నిక ల్లో పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభలో ప్రతిపక్షం ఉప-నాయకుడిగా పనిచేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ ధస్‌ను ఓడించి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేసును సీబీఐకి అప్పగించాలి
ముండే ఆకస్మిక మృతి పలు అనుమానాలకు తావిస్తున్నందున, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అందులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలు పోయేంతగా దెబ్బతినలేదు. వాహనం నిజంగా ప్రమాదానికి గురైందా...? లేక ఎవరైనా పథకం ప్రకారం కుట్ర పన్నారా...? అనేది తేల్చేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మృతి చెందడం సామాన్య విషయం కాదని మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి అవ ధూత్ వాఘ్ అన్నారు. సీబీఐ ద్వారా కేసును దర్యాప్తు చేయించాలని ట్విటర్‌లో డిమాండ్ చేశారు.