
సాక్షి, న్యూఢిల్లీ : ఆటపాటలతో అల్లరి చేస్తూ బరువు బాధ్యతల్లేకుండా బతికే బాల్యం ఎవరికైనా ఇష్టమే. కొందరైతే ఎప్పటికీ ఎదగకుండా బాల్యంలోనే బతుకంతా గడిపేయాలని ఆశిస్తారు. ఎంత ఆశించినా పేద వర్గాలకు చెందిన అభాగ్య బాలలకు అందరిలాగా బాల్యం అందుబాటులో ఉండదు. ఖార్కానాల్లో, గనుల్లో, వెట్టి పనుల్లో వారి బాల్యం చిక్కుకుపోయి ఉంటుంది.
2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో 18 ఏళ్ల లోపు పిల్లలు దాదాపు 45 కోట్ల మంది. దురదృష్టవశాత్తు వారిలో ఐదు నుంచి 18 ఏళ్లలోపున్న మూడున్నర కోట్ల మంది పొద్దుపొద్దున్న నిద్ర లేవగానే పనుల్లోకి వెళ్లిపోవాలి. ఐదు నుంచి 14 ఏళ్ల లోపున్న మరో కోటిన్నర మంది పిల్లలు ఇటుక బట్టీల్లో, బీడీ కంపెనీల్లో, ఇతర ప్రమాదకర రంగాల్లో పనిచేయాలి. ఈ 14 ఏళ్ల లోపు పిల్లల్ని పనుల్లోకి తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రావడం లేవు.
ఇలాంటి పరిస్థితుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ బాల కార్మికులను పనిలో పెట్టుకున్న కంపెనీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీనిపై ఆ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. 1999లో కర్ణాటక హైకోర్టు విద్యుత్ సంస్థ ఆదేశాలను కొట్టివేసింది. దీనిపై విద్యుత్ సంస్థ 2006లో సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. దాదాపు 11 ఏళ్ల అనంతరం సుప్రీంకోర్టు రెండు, మూడు రోజుల క్రితం బాల కార్మికుల చట్టాలను ఉల్లంఘించిన కంపెనీలు, సంస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయవచ్చంటూ తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన అధికారులు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment