డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్!
త్వరలో అమలు చేస్తాం: కేంద్ర మంత్రి రవిశంకర్
గురుగ్రామ్: త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. హరియా ణాలో శుక్రవారం జరిగిన డిజిటల్ సదస్సు– 2017 ప్రారంభోత్సవంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్‌తో అనుసంధానంపై తాను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో ఇప్పటికే చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్ (ఐరిస్, వేలిముద్రలు) సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్ (సంకేత నిక్షిప్త సందేశాలు) విధానంలో సురక్షితంగా భద్రపరిచామని దీనివల్ల ఆధార్ భద్రతకు ఢోకా ఉండదని తెలిపారు. ఆధార్ అనేది కేవలం డిజిటల్ గుర్తింపు మాత్రమేనని, భౌతిక గుర్తింపు కాదని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం(డీబీటీ) అమలుచేయడం వల్ల ఇప్పటి వరకు రూ. 57 వేల కోట్లు ఆదా అయ్యాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. డీబీటీ ద్వారా ప్రయోజనాలు లబ్ధిదారులకే చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు.