
గాంధీనగర్: ఇప్పటికే వేగంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో పులి చేరింది. సింహాల సంఖ్యకు ప్రస్తుతానికి ముప్పేమీ లేకున్నా.. సంరక్షించుకోకపోతే అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరే రోజు మరెంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు వన్యప్రాణి ప్రేమికులు. అందుకే సింహాల సంరక్షణ కోసం గుజరాత్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. దాని ప్రకారం.. సింహాలను వేటాడడమే కాదు.. వాటి వెంట పడుతూ మాంసం విసిరినా, ఫొటోలు తీసినా ఇకపై జైలుకే పంపుతారు.
అంతేకాదు.. సింహాలతో ప్రదర్శనలు కూడా నిషేధమే. ఈ నిబంధనలు అతిక్రమిస్తే అటవీ సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని గుజరాత్ ప్రభుత్వం హెచ్చరించింది. సింహాలను రక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం నాలుగు విభాగాలను ఏర్పాటుచేసింది. కానీ ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే విభాగంగా మార్చింది. ఈ విషయమై ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణ్‌పత్ వాసవ మాట్లాడుతూ.. ‘వేటాడటం అంటే చంపడమే కాదు. ఓ జంతువును హింసించినా అది వేటే అవుతుంది. ఇకపై అటువంటి వాటిని గుజరాత్‌లో ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమ’న్నారు.