
ప్రధానికి ఊరట
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి ఊరట లభించింది. ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు దాఖలు చేసిన పిటిషన్ విషయంలో కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్లో పెద్దగా మెప్పించే విషయాలేమీ లేవని, గతంలో పేర్కొన్న ఆరోపణలే ఉన్నాయని తెలిపింది. 2014లో ఏప్రిల్ 30న లోక్ సభ ఎన్నికలు జరిగిన సందర్భంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మోదీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఆ సందర్భంలో తాను ఓటు వినియోగించుకున్నట్లు సిరా గుర్తు ఉన్న వేలిని చూపిస్తూ దానితోపాటు పార్టీ గుర్తు కమలాన్ని ప్రదర్శించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఒకరు నాడు పిటిషన్ వేయగా కిందిస్థాయి కోర్టు మోదీని సమర్థించి పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లగా మరోసారి అదే పరాభవం ఆప్ కార్యకర్తకు ఎదురైంది. కిందిస్థాయి కోర్టు సరైన తీర్పునే ఇచ్చిందని హైకోర్టు స్పష్టం చేసింది.