ఎమ్మెల్యేలు సోనియాను కలుస్తారన్నది అవాస్తవం: కాంగ్రెస్
బెంగళూరు: కర్ణాటకలోని ఒక ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తున్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. నేరుగా తమ స్వరాష్ట్రానికి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీరంతా ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతారని వస్తున్న కథనాలు అవాస్తవమని పేర్కొన్నాయి.
ఈ నెల 8న జరగనున్న రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో 44 మంది ఎమ్మెల్యేల్ని గత నెల 29న బెంగళూరుకు తరలించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు నేరుగా గుజరాత్ చేరుకుంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తి సిన్హ్ గోహిల్ వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికలో అహ్మద్ పటేల్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు.
పార్టీ నేతలతో అమిత్‌షా సమావేశం
అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో గుజరాత్‌లోని పార్టీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం సమావేశమయ్యారు. గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితుభాయ్ వాఘానీ, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ భూపేంద్రయాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శనివారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న అమిత్‌షా రాజ్య సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇక్కడే బస చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజ్యసభ ఎన్నికకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో అమిత్‌షా కూడా ఉన్న సంగతి తెలిసిందే. రక్షా బంధన్‌లో పాల్గొనేందుకు షా అహ్మదాబాద్ వచ్చారని, ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనరని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.