రేప్ కేసు ఆరోపణలు.. రహీమ్ వెంట మేమున్నాం
సిర్సా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛ సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్ధతు క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఆయనపై నమోదయిన రేప్ కేసులో పంచుకుల సీబీఐ కోర్టు ఆగష్టు 25న తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో గుజర్ల సంఘం ఆయన వెంట నిలుస్తున్నట్లు ప్రకటించింది.
గుజ్జర్ గౌరవ్ సమ్మన్ పేరటి ఆయన డేరా(ఆశ్రమం)లో సమావేశం నిర్వహించింది. కులదీప్ సింగ్ భాటి నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్ గుజ్జర్ల సంఘ నేతలు, హర్యానాకు చెందిన 84 ఖాప్ నేతల అధ్యక్షుడు హర్యానా ధర్మేంద్ర భగత్ కూడా హాజరయ్యారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిస్వార్థంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనకు ఏదైనా అన్యాయం జరిగితే, ఐదు కోట్ల గుజ్జర్ తెగ మొత్తం ఆయన వెంట ఉందని నేతలు ప్రకటించారు. కొన్ని జాతి వ్యతిరేక శక్తులు కుట్ర పన్ని ఆయన్ని ఈ కేసులో ఇరికించాయి అని వాళ్లు తెలిపారు.
ఇక గుజ్జర్ల నేతల సానుభూతి ప్రకటనను రామ్ రహీమ్ స్వాగతించారు. సుమారు లక్ష మంది ఆయన మద్ధతుదారులు ఇప్పటికే సంఘీభావం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పారా మిలటరీ దళాలను హర్యానా ప్రభుత్వం రంగంలోకి దిగింది. కోర్టు తీర్పును గౌరవించాలని, సంయమనం పాటించాలని ఆయన మద్ధతుదారులు పోలీస్ శాఖ కోరింది.