'కాస్త మర్యాదగా ఉండటం నేర్చుకోండి'
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురికి వరుసగా మొట్టికాయలు తగులుతూనే ఉన్నాయి. కాస్త మర్యాదగా ఉండటం నేర్చుకోవాలని సుప్రీంకోర్టు ఆయనకు తలంటింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. గత నాలుగేళ్లుగా ఆయన ఉన్న ఇంట్లోంచి సామాన్లను గత వారం అధికారులు బయటకు తీసుకెళ్లిపోయారు. ఆయనను బంగ్లా ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో అధికారులు గట్టిగా చేయి చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 'ఇంకా ఎవరైనా వచ్చి మీకు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాలా' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రశ్నించారు. అంతకుముందు హైకోర్టుకు వెళ్లినా కూడా బంగ్లా ఖాళీ చేసి తీరాల్సిందేనని అక్కడ సైతం అధిర్ పిటిషన్‌ను తిరస్కరించారు. పశ్చిమబెంగాల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై, గతంలో మంత్రిగా కూడా పనిచేసిన చౌధురి.. బంగ్లా ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.
సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత అధిర్ రంజన్ చౌధురికి వేరే ఇల్లు కేటాయించారు. కానీ, ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయడానికి ఆయన నిరాకరించారు. మరో మూడు ఇళ్లు చూపించినా ససేమిరా అన్నారు. దాంతో చివరకు చేసేదేమీ లేక.. అధికారులు బంగ్లాకు విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేశారు. ఆ తర్వాత ఆయన ఇంట్లోని సోఫా, టేబుళ్లు, కుర్చీలు, ఫొటోలు.. అన్నింటినీ అక్కడి నుంచి తరలించేశారు. దీంతో తన ఆత్మాభిమానం తీవ్రంగా దెబ్బతిందంటూ అధిర్ రంజన్ చౌధురి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. ఏం చేసినా ఫలితం లేకుండా పోయింది.