
రాజస్థాన్ బరిలో అజహర్
58 మందితో కాంగ్రెస్ మూడో జాబితా
ఢిల్లీ నుంచి సిబల్, కృష్ణతీరథ్
సురేశ్ కల్మాడీకి దక్కని చాన్స్
న్యూఢిల్లీ: మొత్తం 58 మందితో లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్‌కు రాజస్థాన్‌లోని సవాయ్‌మదోపూర్ సీటును కేటాయించగా, కేంద్ర మంత్రులు కపిల్‌సిబల్‌ను ఢిల్లీలోని చాందినీచౌక్ స్థానం నుంచి, కృష్ణతీరథ్‌ను వాయువ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు.
అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌జోగికి మహాసముంద్ స్థానాన్ని కేటాయించారు. మూడో జాబితాలో వెల్లడించిన వివరాల మేరకు అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఇద్దరు, చత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, ఢిల్లీ నుంచి ఐదుగురు, గోవా నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఎనిమిది మంది, హర్యానా నుంచి ముగ్గురు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి నలుగురు, ఒడిశా నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి 15 మంది, ఉత్తరప్రదేశ్, అస్సాం, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, డయ్యూడామన్ నుంచి ఒక్కొరు చొప్పున అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన అజహరుద్దీన్ స్థానికంగా ఉన్న వ్యతిరేకతతోనే రాజస్థాన్‌కి మార్చుకున్నట్టు సమాచారం.
ఇక ప్రముఖుల విషయానికి వచ్చే సరికి.. అజయ్‌మాకెన్‌కు న్యూఢిల్లీ స్థానం, ఢిల్లీ మాజీ సీఎం, కేరళ గవర్నర్ షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌కు ఈస్ట్ ఢిల్లీ స్థానం కేటాయించారు. రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్‌కు అజ్మీర్, చంద్రేశ్‌కుమారికి జోద్‌పురి సీట్లు దక్కాయి. గుజరాత్‌లోని పంచమహల్ లోక్‌సభ సీటును కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అల్లుడు పరంజయాదిత్య పర్మార్‌కు కేటాయించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీకి ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాన్ని విశ్వజిత్‌కదమ్‌కి కేటాయించారు. కాగా, ఈ జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి అభ్యర్థులను ఎవరినీ ప్రకటించలేదు.
వారణాసిపై కొనసాగుతున్న సస్పెన్స్
వారణాసి నుంచి నరేంద్రమోడీ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి హస్తం తరఫున ఎవరు బరిలో దిగుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో మంగళవారం విడుదల చేసిన మూడో జాబితాలో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ జాబితాలోనూ వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేయలేదు. ఇదిలావుంటే, వారణాసి నుంచి ప్రముఖ వ్యక్తినే రంగంలోకి దింపనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ చెప్పారు.