సాక్షి ప్రతినిధి, చెన్నై : తన తల్లి, ఇద్దరు సోదరిల ఆత్యహత్యకు కారణమైన పుదుచ్చేరిలోని అరవింద్ ఆశ్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినట్లయితే మిగిలిన కుటుంబసభ్యులతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని జార్ఖండ్‌కు చెందిన హేమలత హెచ్చరించారు. చెన్నైలో శనివారం ‘అమ్మ ద్విచక్ర వాహన పథకం’ను ప్రారంభించిన మోదీ ఆదివారం పుదుచ్చేరిలో అర వింద్ ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హేమలత మీడియాకు చెప్పిన వివరాలు.. పుదుచ్చేరి అరవింద్ ఆశ్రమంలో హేమలత, ఆమె నలుగురు సోదరిలు జయశ్రీ, అరుణశ్రీ, రాజ్యశ్రీ, నివేదిత ఉండేవారు.
2002లో ఆశ్రమ నిర్వాహకులు, సభ్యు లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వీరు ఆరోపించడంతో నిర్వాహకులు వీరిని బలవంతంగా బయటకు పంపారు. దీంతో వీరి కుటుంబం 2014 డిసెంబర్ 18వ తేదీ తెల్ల వారుజామున హేమలత, అరుణశ్రీ, నివేదిత, జయశ్రీ, రాజ్యశ్రీ వారి తల్లిదండ్రు లు ప్రసాద్, శాంతిదేవితో కలసి పుదుచ్చేరి సముద్రంలోకి దిగారు.
ఈ సంఘటనలో అరుణశ్రీ (52), రాజ్యశ్రీ (48), తల్లి శాంతిదేవి (78) చనిపోయారు. అలల్లో కొట్టుమిట్టాడుతున్న నివేదిత, హేమలత, జయశ్రీ, తండ్రి ప్రసాద్‌ను జాలర్లు రక్షించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమకు తిరిగి ఆశ్రమంలో నివసించే అవకాశం కల్పించనందుకు బాధితులు అనేక పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం పుదుచ్చేరిలో అరవింద్ ఆశ్రమ కార్యక్రమానికి వస్తే తామంతా ఆత్మ హత్య చేసుకుంటామని ఆమె హెచ్చరించారు.