చండీగఢ్: చనిపోయే ముందు ఓ పోలీస్ కానిస్టేబుల్ చూపించిన సమయస్ఫూర్తితో అతడి హత్యకు కారణమయిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా ట్విస్ట్‌ను తలపించే ఈ ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. వివరాలు.. గత వారం బుటానా పోలీస్ స్టేషన్ సమీపంలో సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొందరు దుండగులు తమ వాహనాన్ని నిలిపి రోడ్డు మీదే మద్యం సేవించసాగారు. కర్ప్యూ కొనసాగుతున్నప్పటికి వారు దాన్ని లెక్క చేయక రోడ్డు మీదే మందు తాగారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ రవీందర్ సింగ్(28), కప్తాన్ సింగ్(43) వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో దుండగులు, కానిస్టేబుల్స్‌కు మధ్య వివాదం జరిగింది. ఈ ఘర్షణలో రవీందర్ సింగ్, కప్తాన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అయితే చనిపోయే ముందు రవీందర్ సింగ్ తన చేతి మీద దుండగుల వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ని నోట్ చేశాడు. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ చేతి మీద ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దుండగులను గుర్తించారు. చనిపోయే ముందు కూడా రవీందర్ చూపిన సమయస్ఫూర్తిని పోలీసులు తెగ ప్రశంసిస్తున్నారు.
ఈ సందర్భంగా హరియాణా పోలీసు చీఫ్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘చనిపోయే ముందు మా పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ సింగ్ చూపిన తెగువ అభినందనీయం. ఇది ఓ సాధారణ పోలీసింగ్ స్కిల్. చనిపోయే ముందు రవీందర్ సింగ్ దుండగులు వాహనం నంబర్‌ని తన చేతి మీద రాసుకున్నాడు. పోస్టుమార్టం సమయంలో దీని గురించి తెలిసింది. కేసు దర్యాప్తులో ఈ క్లూ ఎంతో సాయం చేసింది. లేదంటే నిందితులను పట్టుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది’ అన్నారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురుని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment