
కర్నాటక మట్టిలో పుట్టాడు.. దేశం వదిలిపోడు..!
మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే కాక, దేశం వదిలి పారిపోయారన్న ప్రచారంతో ఇటీవల ప్రధానంగా వార్తల్లో నిలిచిన లిక్కర్ కింగ్ విజయమాల్యాపై మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. బ్యాంకులకు 9000 కోట్ల రూపాయలు ఎగవేసి, గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశారంటూ మాల్యాపై ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన వెనకేసుకొచ్చారు.
''అతడు కర్నాటక మట్టిలో పుట్టాడు. దేశం వదిలి పారిపోడు'' అంటూ మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ ట్విట్ చేశారు. ఓ టాప్ బిజినెస్ మెన్ ను పట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మాల్యాకు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాల్సిందిగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సమన్లు పంపింది. అయితే తాను దేశం వదిలి పరారైనట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాల్యా ట్విట్టర్ లో ఖండించిన విషయం తెలిసిందే. తాను అంతర్జాతీయ వ్యాపారవేత్తనని, విదేశాలకు వెళ్ళి రావడం తనకు మామూలేనని, పరారైనట్లుగా మీడియా ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాల్యాను సపోర్ట్ చేస్తూ మాజీ ప్రధాని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్నట్లు చెప్తున్నా కచ్చితమైన సమాచారం మాత్రం దొరకలేదు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఆయన ఈనెల 18న భారత్ కు తిరిగి వస్తారా లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే అనుకున్నట్లుగా మాల్యా భారత్ తిరిగి వస్తే ...ఆయన పరారైనట్లు జరిగిన ప్రచారం ఉత్తదేనని తేలిపోవడంతోపాటు.. దేవెగౌడ వ్యాఖ్యలకూ ఊతం చేకూరే అవకాశం ఉంది.