
చండీగఢ్: రానున్న రెండు రోజుల్లో పంజాబ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ శుక్రవారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. పంజాబ్‌లో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణశాఖ తాజాగా హెచ్చరించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. ముందుస్తు చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులంతో సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
రెవన్యూ, డ్రెయినేజీ, హెల్త్, ఫుడ్, యానిమల్ హజ్‌బెండ్రీ శాఖలకు సీఎం కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయి. వరద తాకిడి పెరగడంతో ముందుస్తు జాగ్రత్తగా బాక్రా డ్యామ్ గేట్లను ఎత్తేశారు. సట్లజ్‌తో పాటు జలంధర్ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారికి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లను ఇప్పటికే భారీ వర్షాలు హోరెత్తింస్తున్న విషయం తెలిసిందే.