న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విచారణ నిమిత్తం రెండోరోజు కూడా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఆయనను నిన్న కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా సీబీఐ విచారణ నిమిత్తం వీరభద్రసింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం ఆయనను సీబీఐ అధికారులు సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 2009-2012 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడంపై సిబిఐ ఆయనను ప్రశ్నించింది.
తన పేరుతోపాటు భార్యాబిడ్డలపై ఆయన 6.03 కోట్లు అక్రమంగా కూడబెట్టారు. దీనికి సంబంధించి వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, ఎల్‌ఐసీ ఏజెంట్ ఆనంద్ చౌహాన్, చున్నీలాల్ చౌహాన్‌లపై గత ఏడాది కేసు నమోదైంది. కాగా తన భార్య, పిల్లలు పేరు మీద ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా వీరభద్రసింగ్తో పాటు ఆయన అనుచరులు, కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేసింది.