'నీళ్లు విడిచిన రోజు సైరన్ పని చేయలేదు'
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఘటనకు కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో అనుభవం లేని సిబ్బందిని విహార యాత్రకు పంపంటం వల్లే విద్యార్థులు నదిలోకి దిగారన్నారు. సంఘటన జరిగిన రోజు లార్జి డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో సైరన్ పని చేయలేదని మహేందర్ రెడ్డి తెలిపారు. సైరన్ పనిచేసి ఉంటే విద్యార్థులు అప్రమత్తంగా ఉండేవారన్నారు.
11వ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్వస్థలాలకు వెళ్లారని, ఉత్తరాఖండ్ బాధితుల మాదిరిగా వారికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వటం జరిగిందన్నారు. విద్యార్థులు గల్లంతై పదకొండు రోజులు గడిచినా ఇంకా 17మంది ఆచూకీ దొరకలేదు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక దుఖంతో వెనుదిరిగారు. మరోవైపు ఎన్డీఆర్ఎస్ సిబ్బందితో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి మహేందర్ రెడ్డి, లవ్ అగర్వాల్, కార్తికేయ శర్మ తదితరులు హిమాచల్ ప్రదేశ్లో విద్యార్థుల గాలింపు చర్యలను పర్యవేక్షించారు.