
కేజ్రీవాల్ నన్ను హర్ట్ చేశాడు: హజారే
రాలేగావ్ సిద్ది(మహారాష్ట్ర) : ఢిల్లీ రాష్ట్ర అధికార పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతుండటం, జైళ్లకు వెళ్లడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌పై తాను పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు జైలుకు వెళ్లడం, మరికొందరిపై ఆరోపణలు రావడం బాధ కలిగిస్తోందని అన్నారు.
కేజ్రీవాల్ తనతో ఉన్నప్పుడు గ్రామ్ స్వరాజ్ పేరుతో ఒక పుస్తకం రాశారని తెలిపిన హజారే.. గ్రామ్ స్వరాజ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ చాలా ఏళ్లు తనతో ఉన్నారని, రాజకీయాల్లో ఆయన సరికొత్త ఒరవడిని తీసుకువస్తారని ఆశించానని హజారే పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన సహచరులు చేస్తున్న పనులు, ముఖ్యంగా కొందరు జైలుకు వెళ్లడం, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం తనకు చాలా బాధ కలిగించిందని హజారే చెప్పారు.