
జైలుకెళ్లడం ఓ ఫ్యాషన్ : అన్నా హజారే
బెంగళూరు : ఏ పోరాట యోధుడికైనా జైలు కెళ్లడం అనేది అలంకారంగా ఉంటుందని, అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మందికి జైలుకెళ్లడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయిందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బాధపడ్డారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమం ద్వారా దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిన హజారే ‘అసలీ ఆజాదీ’ పేరిట మరో ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. గాంధీభవన్‌లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ‘అసలీ ఆజాదీ’ ఉద్యమాన్ని హజారే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ వ్యక్తి అయినా న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. బెయిల్ కోసం షూరిటీ మొత్తాన్ని చెల్లించనని మొండిగా ప్రవర్తించడం ఎంత మాత్రం సరికాదని కేజ్రీవాల్, ఆయన అనుచరులనుద్దేశించి విమర్శలు చేశారు.
తమపై అన్యాయంగా కేసులు మోపారని భావిస్తే వాటిని నిరాధారమైనవిగా నిరూపించే ప్రయత్నం చేయాలన్నారు. అలా కాకుండా బెయిల్ తీసుకోవడానికి షూరిటీ చెల్లించనని చెప్పడాన్ని న్యాయ వ్యవస్థను గౌరవించే ఏ ఒక్కరూ సహించరని చెప్పారు. ఈ విషయంపై కేజ్రీవాల్‌కి మీరేమైనా సలహా ఇస్తారా అన్న మీడియా ప్రశ్నకు.. ‘ఇంతకు ముందు కేజ్రీవాల్ నా సహచరునిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నా పరిధిలో లేరు’ అని అన్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై ఇప్పుడే తానేమీ మాట్లాడలేనని, అయితే మోడీకి అంతా శుభమే జరగాలని మాత్రం కోరుకుంటున్నానని అన్నా హజారే తెలిపారు.